నిర్మానుష్యంగా మారిన చార్మినార్ రోడ్డు
సాక్షి సిటీబ్యూరో: నగరానికి కర్ఫ్యూలు కొత్తేమీ కాదు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన నాటి నుంచి నేటి వరకు పలు దఫాలుగా కర్ఫ్యూలు అమలయ్యాయి. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా జనతా కర్ఫ్యూను విధించారు. సుమారు మూడు రోజుల పాటు ప్రజలు కర్ఫ్యూ వాతావారణంలో గడిపారని పలు చరిత్రకారులు తెలిపారు. ఆపరేషన్ పోలో అనంతరం నిజాం సైన్యాధికారి ఈఐ. ఇద్రూస్ భారత సైన్యాధికారి జె.నాత్ ముందు లొంగిపోయారు. దీంతో రజాకార్లు ప్రజలపై ప్రతీకారం తీసుకుంటారనే అనుమానంతో తెలంగాణ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటి జనతా కర్ఫ్యూ మాదిరిగా అత్యవసర సేవలు తప్ప అన్ని కార్యకపాలు ఒక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇలా నగరంలో ఇప్పటి వరకు రెండుసార్లు జనతా కర్ఫ్యూ అమలైంది.
కర్ఫ్యూలు కొత్త కాదు  
1969 నుంచి 2014 వరకు కలహాలతో నగరంలో పలు దఫాలుగా కర్ఫ్యూను విధించారు. కొన్ని సార్ల కలహాలు తీవ్ర స్థాయిలో జరగడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు 15 నుంచి 20 రోజులు నగరంలో కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. ప్రతిసారీ నగరంలో కలహాలు జరిగడం.. ప్రభుత్వం కర్ఫ్యూలు విధించడంతో నగరాన్ని కర్ఫ్యూ నగరంగా పిలిచారని సీజియర్ సిటిజన్స్ వెల్లడించారు. దక్షిణ భాతరదేశంలో హైదరాబాద్‌లో విధించిన కర్ఫ్యూల సంఖ్య ఇతర దక్షిణాది ప్రదేశాలతో పోలిస్తే ఎక్కువే.  1969, 1974–75, 1979, 1982, 1986, 1990, 1992, 1996, 1998, 2002, 2009, 2011 వరకు నగరంలో పలు దఫాలుగా కర్ఫ్యూలు అమలయ్యాయి. 1979లో రమీజా బీ, 1992 బాబ్రీ విధ్వంసంతో పాటు పలు కలహాల సందర్భాల్లో రోజుల తరపడి కర్ఫ్యూ కొనసాగింది. రమీజా బీ, బాబ్రీ విధ్వంసం సమయంలో నగరంలో అత్యధిక రోజులు కర్ఫ్యూ కొనసాగింది. 2009, 2011, 2014లో కర్ఫ్యూ కేవలం కొన్ని ప్రాంతాల పరిధిలోనే విధించారు.
నార్త్, వెస్టు జోన్లలో నో కర్ఫ్యూ..  
నగరంలో ఎన్నో దఫాలుగా కర్ఫ్యూ అమలైంది. ప్రతిసారీ కర్ఫ్యూను ఈస్ట్, సౌత్ జోన్ పరిధిలోనే విధించారు. ఎప్పడు నార్త్, వెస్టు జోన్లలో కర్ఫ్యూ అమలైన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కర్ఫ్యూ అమలైనవి అన్ని ఈస్ట్, సౌత్ జోన్లలోనే ఉన్నాయి. అందులో కూడా అత్యధికంగా కర్ఫ్యూలు సౌత్‌జోన్ పరిధిలోనే అని లెక్కలు చెబుతున్నాయి. నగరంలో అమలైన కర్ఫ్యూల గురించి తెలసుకుంటే నగర ప్రజలు కర్ఫ్యూ రోజుల్లో భయాందోళనతో క్షణ, క్షణం గడిపేవారు. ఎప్పుడు ఏమైతుందో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రింభవళ్లు నిద్రాహారాలు మాని రోజులు గడిపేవారు.
భద్రతా సిబ్బందికి తలనొప్పులు లేవు
అదివారం అమలైన జనతా కర్ఫ్యూలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కర్ఫ్యూ అనగానే మత, వర్గ కలహాలు జరిగి ధన, ప్రాణ నష్టం సంభవించడంతో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తుంది. ఇలాంటి కర్ఫ్యూ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకొని ప్రాణాలకు లెక్క చేయకుండా తమ విధులు నిర్వహిస్తారు. కానీ జనతా కర్ఫ్యూతో నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కరోనా వైరస్ నుంచి తమకు తాము రక్షణ పొందడానికి, ఇతరుకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఇళ్లకే పరిమితమయ్యారు.నగరంలో కర్ఫ్యూల సందర్భంగా రహదారులు, గల్లీలో తీగ కంచెలు పెట్టి జనాన్ని కంట్రోల్ చేసేవారు. గతంలో కర్ఫ్యూ సందర్భంగా జనాన్ని ఇంటి నుంచి బయటకి రాకుండా నివారించడానికి పోలీసులకు ఎన్నో కష్టాలు ఉండేవి. కానీ జనతా కర్ఫ్యూతో ప్రజలే కుల, మత, వర్గాల బేధం లేకుండా పోలీసులకు సహకరించారు. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
