వడ.. దడ | is there chaitanya expeditions ? | Sakshi
Sakshi News home page

వడ.. దడ

Jun 3 2014 1:25 AM | Updated on Oct 1 2018 3:56 PM

రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.

ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. భూసార పరీక్షల ప్రాధాన్యం, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, విత్తనశుద్ధి, శ్రీవరి సాగు, ఆరుతడి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. గ్రామాల వారీగా నిర్వహించే ఈ చైతన్యయాత్రలకు పశుసంవర్ధకశాఖ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్య, సాగునీటి, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మార్కెటింగ్, ట్రాన్స్‌కో, బ్యాంకులు, గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారులు హాజరవుతారు.

 రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. సందేహాలు నివృత్తి చేస్తారు. పంట రుణాలు, రాయితీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రైతు చైతన్యయాత్రలను ప్రభుత్వం ఏటా ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేది. అయితే ఈ ఏడాది ఎన్నికల దృష్ట్యా కాస్త ఆలస్యమవుతుందని అంతా భావించారు. మే మూడో, ఆఖరు వారంలో నిర్వహిస్తారని ఆశించారు. కానీ జూన్ నెల ప్రారంభమైనా కార్యక్రమం నిర్వహణ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 సాగు పనులు షురూ..
 రైతులంతా ఖరీఫ్ పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని పంటల సాగుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భూసారానికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలి, ఏయే కంపెనీ విత్తనాలు కొనాలి, ఏయే క్రిమిసంహారక మందులు చల్లాలి, యంత్రాల వినియోగం, తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు.. తదితర అంశాలపై ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు సూచనలు.. సలహాలు అందించేవారు కరువయ్యారు. అవగాహన లేక ప్రతీ సీజన్‌లో ఎందరో రైతులు పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టక నష్టపోతున్నారు. మోతాదుకు మించి రసాయన, క్రిమిసంహారక మందులు వాడుతూ నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది చైతన్యయాత్రలు లేవని తెలిసిన అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు.

 కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక..
 మొన్నటి దాకా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంతో రైతు చైతన్య యాత్రలు మే నెలలో నిర్వహించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే కార్యక్రమం నిర్వహణపై ఆదేశాలు వెలువడే అవకాశముందని పేర్కొంటున్నారు. దీంతో ఖరీఫ్ సీజన్‌లో రైతు చైతన్యయాత్రల నిర్వహణ సాధ్యంకాకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement