ఆర్టీసీలో కుంభకోణం 

Irregularities In TSRTC In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ(వరంగల్‌): అసలే నష్టాలతో కుదేలైన టీఎస్‌ ఆర్టీసీలో కుంభకోణం వెలుగు చూసింది. అన్ని దారుల నుంచి ఆదాయం అంతంతగానే వస్తుండగా.. ఇందులో ఎక్కువ ఆదాయం సమకూరే మార్గాన్ని గుర్తించిన కొందరు గండి కొట్టారు. ఎవరూ ఊహించని విధంగా కుంభకోణా నికి తెరలేపారు. వరంగల్‌ రీజియన్‌లో బస్‌ పాస్‌ల జారీ బాధ్యతలు చేజిక్కించుకున్న ‘డెటాక్షర్‌’ ఏజెన్సీ బాధ్యులు దీనికి కారణమని తెలుస్తోంది. తమ సిబ్బంది ద్వారా విద్యార్థి బస్‌పాస్‌ కోడ్‌తో జనరల్‌ పాస్‌లు జారీ చేశారని.. తద్వారా పెద్దమొత్తంలో సంస్థ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. అయితే, ఇదే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్లలో బస్‌పాస్‌ల జారీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అంతటా ఇదే విధంగా కుంభకోణం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, వరంగల్‌ రీజియన్‌లో కుంభకోణం జరిగినట్లు పోలీసుల విచారణలోనూ తేలినట్లు సమాచారం.

2017లో ప్రైవేట్‌పరం
టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రకరకాలుగా రాయితీలు అందిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు రాయితీపై బస్‌ పాస్‌లు, సాధారణ ప్రయాణికులకు సీజనల్, జనరల్‌ బస్‌పాస్‌లు జారీ చేస్తున్న విషయం విషయం విదితమే. గతంలో బస్‌పాస్‌లను సంస్థ ద్వారా జారీ చేయగా.. 2017లో ప్రైవేట్‌ పరం చేశారు. ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో డెటాక్షర్‌ సంస్థకు పాస్‌ల జారీ బాధ్యతలు అప్పగించగా... 2017 జూలై 9 నుంచి 2020 జూలై 8వ తేదీ వరకు ఒప్పందం ఉంది. ఈ ఏజెన్సీ రీజియన్‌లోని 9 డిపోల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి పాస్‌లు జారీ చేస్తుండగా.. ఒక్కో పాస్‌కు రూ.30 తీసుకుంటారు. పాస్‌లు జారీ, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం సంస్థల ఈ డబ్బు చెల్లిస్తుంది. అయితే ఇది చాలదన్నట్లుగా నిర్వాహకులు అక్రమాలకు తెర లేపారు.

విద్యార్థుల కోడ్‌పై సాధారణ ప్రయాణికులకు...
ఎవరూ గుర్తించని విధంగా ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది తప్పుడు పద్ధతుల్లో పాస్‌ల జారీకి పూనుకున్నారు. విద్యార్థులకు తక్కువ ధరకే పాస్‌లు జారీ చేస్తుండగా.. సాధారణ ప్రయాణికులు తీసుకునే జనరల్‌ బస్‌ పాస్‌కు చార్జీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ప్రైవేట్‌ సంస్థ సిబ్బంది... ఆర్టీసీ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఆదాయానికి గండి కొట్టడం మొదలుపెట్టారు. ప్రతీ బస్‌ పాస్‌ జారీ చేసే క్రమంలో ప్రత్యేక నంబర్‌ వస్తుంది. అయితే, కొందరు విద్యార్థులు సెలవులప్పుడు, ఇతర కారణాలతో ప్రతి నెల బస్‌ పాస్‌ తీసుకోవడం లేదు. ఇలా బస్‌ పాస్‌లు తీసుకోలేని వారి వివరాలు నమోదు చేసుకుని వారి నెంబర్‌పై జనరల్‌ బస్‌పాస్‌లు జారీ చేస్తూ అక్రమాలకు తెరలేపారు. ఉదాహరణకు ఒక విద్యార్థి బస్‌పాస్‌కు రూ.145 చెల్లిస్తారు. ఇదే పాస్‌ నెంబర్‌ను జనరల్‌ పాస్‌ జారీ చేసే కార్డుపై ప్రింట్‌ అయ్యేలా ఎడిట్‌ చేసి రూ.3,220 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.145 మాత్రమే ఆర్టీసీకి చెల్లించి రూ.3,075 జేబులో వేసుకుంటున్నారు. 

ఫిర్యాదు.. విచారణ
ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీలో అక్రమాలు జరిగాయని గుర్తించిన వరంగల్‌ రీజియన్‌ అధికారులు హన్మకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడవంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌ భవన్‌ నుంచి డిప్యూటీ సీటీఎం (టెక్నికల్‌) రాజును విచారణకు యాజమాన్యం పంపింది. దీంతో గురువారం హన్మకొండకు చేరుకున్న ఆయన కంప్యూటర్లలో బస్‌పాస్‌ల జారీ తీరును పరిశీలించి విచారణ ప్రారంభించారు. మరో వైపు పోలీసులు హన్మకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ ఆవరణలోని సిటీ బస్‌ స్టేషన్‌లో ఉన్న వరంగల్‌–1 డిపో బస్‌పాస్‌ కౌంటర్‌కు సంబంధించిన కంప్యూటర్లు, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిలిపివేత.. క్యూఆర్‌ కోడ్‌ అమలు
అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఆర్టీసీ అధికారులు గురువారం వరంగల్‌ రీజియన్‌ వ్యాప్తంగా బస్‌పాస్‌ల జారీని నిలిపివేశారు. అలాగే, పాస్‌ల జారీలో మార్పులు చేపట్టారు. అక్రమాలకు పాల్పడకుండా ప్రతీ పాస్‌ను క్యూఆర్‌ కోడ్‌తో జారీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఒక్కో పాస్‌కు ఒక్కో క్యూఆర్‌ కోడ్‌ రానుండగా.. ఆ నంబర్‌తో మరో పాస్‌ తయారుచేయడం, జారీ చేయడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top