ఇంటర్ విద్యలో సీనియర్లకు అన్యాయం..
జూనియర్లు, అర్హత లేనివారికి అందలం
డీఐఈవోలు, ఆర్‌ఐవోఎస్‌ల పదోన్నతుల్లో అక్రమాలు
సీనియారిటీ లిస్టులో ముందున్న వారిని పక్కనబెట్టిన వైనం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో మరో అక్రమ బాగోతం బయటపడింది. ఇంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీల్లో డబ్బులిచ్చిన వారికి పట్టణాల్లో పోస్టింగ్‌లు కట్టబెట్టిన అధికారులు.. బోర్డు ఆదేశాలు లేకుండానే డబ్బులు తీసుకుని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు. తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేనివారికి, జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయీ బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాను సైతం పట్టించుకోకుండా అత్యంత జూనియర్లకు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా అధికారులు (డీఐఈవో)గాను, ప్రాంతీయ తనిఖీ అధికారులు (ఆర్‌ఐవో)గాను పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరిదిద్దలేదని, తమ అభ్యర్థనలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్హతగలిగిన సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది క్రితమే జాబితా విడుదల
గతేడాది డిసెంబర్‌లో జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా ఉన్న 340 మందితో సీనియారిటీ జాబితా విడుదల చేశారు. డీఐఈవో, ఆర్‌ఐవో పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లో సీనియారిటీ ప్రకారం వీరినే నియమించాల్సి ఉంది. అయితే, మొత్తం ప్రిన్సిపాల్స్ జాబితాలో 1 నుంచి 62 వరకు ఉన్న వారితో నియామకాలు సక్రమంగానే చేపట్టారు. 63 నుంచి 340 వరకు సీనియారిటీని పట్టించుకోలేదు. ఏపీపీఎస్సీ ద్వారా జేఎల్స్‌గా నియమితులైన వారిని కాదని, స్కూల్ అసిస్టెంట్లు నుంచి జేఎల్స్‌గా వచ్చిన వారు, జాబితాలో జూనియర్ స్థాయి వారిని ఆర్‌ఐవో, డీవీఈవోలుగా నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ అవుతారు.
తర్వాత సెక్షన్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్‌గా పదోన్నతి ఇవ్వడం అసాధ్యం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటర్మీడియెట్ విద్యామండలిలో దీనిని సుసాధ్యం చేశారు. విద్యావ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను కాదని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్‌కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జూనియర్ లెక్చరర్లకు జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా (డీవీఈవో) పదోన్నతులు కల్పించారు. ఇంటర్ విద్యా మండలిలో జూనియర్ లెక్చరర్లను సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి కల్పిస్తారు. ప్రిన్సిపాల్స్ సీనియారిటీ ఆధారంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు(డీవీఈవో)గా పదోన్నతి ఇస్తారు. కానీ, కొందరు ప్రిన్సిపాల్స్‌కు పదోన్నతి, సీనియారిటీతో సంబంధం లేకుండా జీవో 283లోని లోపాలను అడ్డుపెట్టుకుని నేరుగా డీవీఈవో పదోన్నతులు ఇచ్చారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సీనియర్ ప్రిన్సిపాల్స్‌కు అన్యాయం
సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్(జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్(ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపాల్ అయ్యుండాలి. కానీ. అవేం పట్టించుకోలేదు. జీవో 283లో డెప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపాల్స్‌కు ఉద్దేశించిన ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అంశాన్ని జేఎల్స్‌గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొత్త భాష్యం చెప్పి పదోన్నతులు కల్పించారు. ఈ అంశం తప్పుగా జరిగిందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదం ముగియకుండానే తాజాగా డీఐఈవో, ఆర్‌ఐవోలుగా జూనియర్లను నియమించడంపై గొడవ మొదలైంది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ తరహా నియామకాలు జరగ్గా.. ఇదే తరహాలో మరికొందరికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనివెనుక పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన తప్పులపై డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేస్తే పరిగణనలోకి తీసుకుని సరిదిద్దాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడంపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది.


