నాగం వైపే అందరి చూపు.. | Interesting politics in nagarkurnool | Sakshi
Sakshi News home page

నాగం వైపే అందరి చూపు

Nov 20 2017 10:45 AM | Updated on Mar 18 2019 9:02 PM

Interesting politics in nagarkurnool - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు తమ బలాబలాలను పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి. తమ అనుకూలతలు, ప్రతికూలతలపై అంచనాలు వేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలు పు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటు అధికార టీఆర్‌ఎస్‌ తమ పార్టీకి వలస వచ్చిన వారిని తిరిగి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి వారు ఆయా నియోజకవర్గాలలో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వా త ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి నేతలు, ప్రజాప్రతినిధులు వలస బాటపట్టారు.

ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతూ వస్తున్నారు. ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ అంశంపై దృష్టి సారిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నయానో భయానో ఒప్పించి పాత వారికి మళ్లీ పార్టీ కండువా కప్పాలని ప్రయత్నాలు జోరుగా మొదలుపెట్టాయి. దీంతో అధికార పక్షమూ అప్రమత్తమైంది. ఇతర పార్టీల నుంచి వచ్చి న వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో వలసనేతలు ఏది బెటరో తేల్చుకునే పనిలో తలమునకలవుతున్నారు.  

కల్వకుర్తిలో వలసల పరంపర 
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అనూహ్యంగా గెలుపొందిన వంశీచంద్‌రెడ్డికి వలసల తలనొప్పి నేటికీ తప్పడం లేదు. తాజాగా నగర పంచాయతీ చైర్మన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కారెక్కారు. నగర పంచాయతీలో ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ బలం ఒకటికి పడిపోయింది. ఎమ్మెల్యే వంశీచంద్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన సుదర్శన్‌రెడ్డి, చింతా రాంమోహన్‌రెడ్డిలు సైతం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వరమ్మ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందినప్పటికీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌ కరుణశ్రీ, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, కలకొండ మాజీ సర్పంచ్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సన్నిహితుడైన పవన్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ మారారు. తలకొండపల్లి జెడ్పీటీసీ, ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అధికార పార్టీకి కాంగ్రెస్‌ నుంచి వలసల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఎవరెటు వెళ్లినా తమకేమీ ఇబ్బందులు లేవన్న ధీమా మాత్రం కాంగ్రెస్‌లో ఉంది. ఇదే నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు మరో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, కేవీఎన్‌ రెడ్డి కీలక నాయకులుగా గుర్తింపు పొందారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.  

అచ్చంపేటలో టీడీపీ నుంచి భారీ వలసలు 
అచ్చంపేట నియోజకవర్గంలో ఇటీవలి టీడీపీ నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు చోటుచేసుకున్నాయి. అచ్చంపేట ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు నర్సింహారెడ్డి, కొండనాగులకు చెందిన చంద్రమోహన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బల్మూర్‌ జెడ్పీటీసీ సభ్యుడు ధర్మానాయక్‌ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా ఉప్పునుంతల ఎంపీపీ అరుణమ్మ, అమ్రాబాద్‌ ఎంపీపీ రామచంద్రమ్మ, వంగూరు ఎంపీపీ భాగ్యమ్మ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చారు.

వీరితోపాటు టీడీపీ ముఖ్య నేతలు పోకల మనోహర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తులసీరాం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోగా వారి అనుచరులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్దఎత్తున అధికార పార్టీలో చేరారు. వలస వెళ్లిన వారిని తిరిగి రావాలని టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయనప్పటికీ.. కాంగ్రెస్‌ మాత్రం తిరిగి తమ నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అందరితో టచ్‌లో ఉంటున్నారు. కచ్చితంగా ఈసారి స్థానిక సంస్థలలో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేస్తూ పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లోని ఆయన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు ఇతర పార్టీలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి జూపల్లి తనపై కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డిని సైతం ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యతిరేకులను కూడగట్టి తమ విజయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోంది.  

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఈసారి తన కుమారుడు కూచకుళ్ల రాజేష్‌ను ఎమ్మెల్యే బరిలో దించుతున్నట్లు తన సన్నిహితులకు చెబుతూ వస్తున్నారు. దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ఇంకా మిగిలి ఉండడంతో అసెంబ్లీ బరిలో తన కుమారుడిని దింపడం ద్వారా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి రాజేష్‌ కూడా ఆసక్తి చూపుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి మరిన్ని వలసలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

నాగం వైపే అందరి చూపు
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాన్ని 30ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నాగం జనార్దన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కీలకనేతగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగుతారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగం ఖండిస్తున్నారు. బీజేపీకి గ్రామ, మండల స్థాయిలో కేడర్‌ను పెంచుకునేందుకు నాగం తనదైన వ్యూహంతో ముందుకు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో చివరి నిమిషంలో అద్భుతం జరుగుతుందని నాగం తన సన్నిహితులతో చెబుతూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement