తప్పెవరిది.. శిక్ష ఎవరికి?  

Inter Students Marks Was Changed For Thousands of Students - Sakshi

మూల్యాంకనంలో తప్పులా..? సాంకేతిక సమస్యలా?

బయటకు చెప్పేందుకు ఇంటర్‌ బోర్డు తర్జనభర్జన

వేల మంది విద్యార్థులకు మారిన మార్కులు

పాసైన వారు 1,137 మందే అయినా.. మార్కులు మారిన వారి సంఖ్య ఎక్కువే

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ రీవెరిఫికేషన్‌లో భారీగా మార్కుల్లో తేడాలు బయటపడ్డాయి. మొదట ఫెయిలైన విద్యార్థులకు ఒక మార్కు నుంచి 49 మార్కుల వరకు పెరిగాయి. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులై, తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గరిష్టంగా 60 మార్కుల వరకు అదనంగా వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డు వైఫల్యాలు బయటపడ్డాయి. గ్లోబరీనా సంస్థ కారణంగా జరిగిన సాంకేతిక తప్పిదాలు, మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది తప్పిదాల కారణంగా జరిగిన ఈ తప్పులకు బోర్డు ఎవరిని బాధ్యులను చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రీవెరిఫికేషన్‌తో బయటపడిన మరిన్ని వైఫల్యాలు..
రీవెరిఫికేషన్‌తో మారిన మార్కులు ఇంటర్‌ బోర్డు వైఫల్యాలను బయటపెట్టింది. సాంకేతిక సమస్యలే కాదు.. మూల్యాంకన లోపాలు, లెక్కించడంలో సిబ్బంది చేసిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. వాస్తవంగా విద్యార్థులు రాసిన జవాబులకు, మెమోల్లో వచ్చిన మార్కులకు పొంతన లేకుండా తప్పిదాలు దొర్లాయి. రీవెరిఫికేషన్‌ తరువాత తమకు వచ్చిన మార్కులను చూసి విద్యార్థులే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులన్న అంశాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు పక్కన పడేసింది. మూల్యాంకనం చేసిన లెక్చరర్లు, మార్కులు లెక్కించిన సిబ్బంది, ఆన్‌లైన్‌లో ప్రాసెస్‌ తప్పులు చేసిన ఏజెన్సీ.. ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితిలో పడింది. 

నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే వీలున్నా..
బోర్డు నిబంధనల ప్రకారం పేపర్‌ వ్యాల్యుయేషన్‌లో తప్పు చేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లేదంటే వారి మూల్యాంకనం విధుల నుంచి కనీసం రెండేళ్లపాటు బహిష్కరించవచ్చు. అలా చేస్తే భవిష్యత్‌లో జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనల్లో బోర్డు వర్గాలు ఉన్నాయి. ఇక సాంకేతిక తప్పిదాలకు కారణమైన డాటా ప్రాసెస్‌ చేసిన సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అన్నది ప్రశ్న. డాటా ప్రాసెస్‌లో పొరపాట్లు చేసిన సంస్థకు మూడేళ్లపాటు పనులను అప్పగించారు. ఇప్పుడు ముగియకుండా వారి టెండరును రద్దు చేసే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం.

ఇవీ లోపాలకు ఉదాహరణలు..
- ఇంటర్‌లో ఫెయిలైన వారికి పెరిగిన మార్కులు 1 నుంచి 48 కాగా, ఉత్తీర్ణులై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారికి గరిష్టంగా పెరిగిన మార్కులు 60.
ఫలితాల్లో ఒక విద్యార్థి మొదట ఫెయిల్‌ కాగా.. తరువాత వచ్చిన మార్కులు 91.
కామర్స్‌లో ఒక విద్యార్థికి మొదట వచ్చిన మార్కులు 12.. రీవెరిఫికేషన్‌ తరువాత లభించిన మార్కులు 62.
ఓ విద్యార్థికి సంస్కృతంలో మొదట వచ్చిన మార్కులు 5.. రీవెరిఫికేషన్‌లో వచ్చిన మార్కులు 50.
ఇంకో విద్యార్థికి తెలుగులో తొలిసారి వచ్చిన మార్కులు 18...తరువాత వచ్చినవి 41 మార్కులు.
ఆంగ్లంలో ఓ విద్యార్థికి 25 మార్కులొస్తే.. రీవెరిఫికేషన్‌లో లభించిన మార్కులు 43.
ఫెయిలైన విద్యార్థుల్లో ఒకరికి కెమిస్ట్రీలో మొదట వచ్చిన మార్కులు 15.. తరువాత లభించిన మార్కులు 25.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top