
సాక్షి, హైదరాబాద్: తనపై తెలంగాణ పోలీసుల వివిధ ప్రాంతాల్లో పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం తమ వాదనలతో, ఎన్నికల నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు ఇవ్వాల్సిన సమాచార వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తమ వాదనలు తెలియజేసేందుకు సమయం కావాలని రేవంత్ తరఫు సీనియర్ న్యాయ వాది సీవీ మోహన్‌రెడ్డి కోరారు.
దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాల్ని అఫిడవిట్‌లో పేర్కొనాలని, తనకు తెలిసిన కేసుల్లో చట్ట ప్రకారం స్పందించానని, తెలియకుండా ఏమైనా కేసులు ఉన్నాయేమో వాటి వివరాలు ఇవ్వాలని కోరితే పోలీసులు ఇవ్వడం లేదని, వాటిని ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.