వార్తా పత్రికలు శుభ్రమైనవి.. వైరస్‌ ఉండదు

INMA CEO Earlje Wilkinson Says News Papers Not Effect With Any Virus - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆధారాల్లేవు

డాక్టర్లు, సైంటిస్ట్‌ల మాట ఇదే..

ఐఎన్‌ఎంఏ సీఈవో ఎర్ల్‌జే విల్కిన్‌సన్‌  

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్‌ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని ఇంటర్నేషనల్‌ న్యూస్‌ మీడియా అసోసియేషన్‌ (ఐఎన్‌ఎంఏ) ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్, సీఈవో ఎర్ల్‌జే విల్కిన్‌సన్‌ స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్లు, శాస్త్రవేత్తలందరి అభిప్రాయమూ ఇదేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తుందన్న అపోహ చాలా చోట్ల కనిపిస్తోందని, సైన్స్‌ పరంగా ఇందులో వాస్తవాలేమిటో తెలియజేయాల్సిందిగా కొంతకాలంగా ఐఎన్‌ఎంఏను కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు జరిపిన పరిశోధనలు కూడా వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టంచేశాయని ఆయన తెలిపారు. కరోనా కేసులున్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలు, మ్యాగజైన్లతో కూడిన ప్యాకేజీలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పూ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి వార్తా పత్రికలను ముట్టుకున్నా అతడి నుంచి కాగితంపైకి వైరస్‌ సోకదని, వార్తా పత్రికల రవాణా ద్వారా కూడా సమస్య ఏమీ ఉండదని స్పష్టంగా తెలిపింది. (డాక్టర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌)

బీబీసీ మాట కూడా ఇదే.. 
ఈ నెల 10వ తేదీ బీబీసీ రేడియో జాన్‌ ఇన్నెస్‌ సెంటర్‌లోని వైరాలజిస్ట్‌ జార్జ్‌ లొమోనోస్సాఫ్‌తో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. వార్తా పత్రికలు చాలా శుభ్రమైనవి అని స్పష్టం చేశారు. ప్రింటింగ్‌ కోసం వాడే సిరా, ప్రింటింగ్‌ జరిగే పద్ధతి తదితర కారణాల వల్ల వార్తా పత్రికల ఉపరితలంపై వైరస్‌ ఉండే అవకాశాలు అత్యల్పమని ఆయన తెలిపారు. వివిధ ఉపరితలాలపై కరోనా వైరస్‌ (సార్స్‌–సీఓవీ2) ఎంత కాలం ఉంటుందన్నదానిపై ఇటీవలే ఒక పరిశోధన జరిగిందని, దాని ప్రకారం వార్తా పత్రికలపై వైరస్‌ ఉండే అవకాశమే లేదని స్పష్టమైందని ఐఎన్‌ఎంఏ సీఈవో ఎర్ల్‌ జే విల్కిన్‌సన్‌ తెలిపారు. మొత్తమ్మీద చూస్తే వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాపించిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. వాడే సిరా, ప్రింటింగ్‌ పద్ధతుల కారణంగా మిగిలిన వాటికంటే వార్తా పత్రికలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికల ప్రచురణ కర్తలు ప్రింటింగ్, పంపిణీ జరిగే చోట, న్యూస్‌స్టాండ్లలో, ఇళ్లకు చేరే సమయంలోనూ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని ఎర్ల్‌ జే. విల్కిన్‌సన్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top