డాక్టర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

Coronavirus : Four Positive Cases Registered In Telangana - Sakshi

మరో ఇద్దరికి కూడా కరోనా..

నలుగురిలో ముగ్గురికి వైరస్‌

ఎలా సోకిందో అంతుబట్టని వైనం

తలలు పట్టుకుంటున్న అధికారులు

రాష్ట్రంలో 45కు చేరిన కేసులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇద్దరు ప్రైవేటు డాక్టర్లకు కరోనా వైరస్‌ సోకింది. వీరిద్దరూ భార్యా భర్తలు. వీరికి విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భర్త వయసు 41 ఏళ్లు కాగా, భార్య వయసు 36 ఏళ్లు అని తెలిపింది. అలాగే మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా గురువారం పాజిటివ్‌ వచ్చింది. సికింద్రాబాద్‌లోని బుద్దానగర్‌కు చెందిన మరో వ్యక్తి (45)కి కూడా పాజిటివ్‌ వచ్చింది. వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. అయితే వీరిలో ముగ్గురికి ఎవరి నుంచి కరోనా వైరస్‌ సోకిందన్న దానిపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేకపోతోంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి ఈ నెల 14న సంపర్క్‌క్రాంతి రైలులో ఢిల్లీ వెళ్లాడు. 17న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి బయల్దేరి 18న హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. అప్పటికే అతడికి జ్వరం, జలుబు ఉన్నాయి. తన కొడుకుతో కలసి ఆటోలో ఇంటికి వెళ్లాడు. కుత్బుల్లాపూర్‌లో ఒక డాక్టర్‌ను కలిశాడు. అజిత్రోమైసిన్, డోలో 650 మాత్రలను వాడాలని డాక్టర్‌ చెప్పాడు. 18 నుంచి ఈ మందులనే వాడిన ఆయన.. అత్యంత ఆలస్యంగా 25న గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అతడి నమూనాలు తీసుకున్న వైద్యులు, కరోనా పాజిటివ్‌గా ప్రకటించారు.
(నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!)

డాక్టర్‌ తిరుపతి వెళ్లొచ్చాడు..
ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఇద్దరికీ పాజిటివ్‌ సోకింది. అయితే భర్త నుంచి భార్యకు సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భర్త ఈ నెల 14 నుంచి 16 వరకు ఇంట్లోనే సెలవులో ఉన్నాడు. ఈ నెల 17న ఇండిగో విమానంలో తిరుపతి వెళ్లాడు. అదేరోజు స్విమ్స్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ను కలసి వచ్చాడు. తిరిగి అదే రోజు రాత్రి 7.05 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు. ఈ నెల 18, 19 తేదీల్లో ఇంట్లోనే ఉన్నాడు. 20న తాను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యం బాగోలేదని ఒక గంట ఉండి ఇంటికి వచ్చాడు. 21న ఆయనలో కరోనా అనుమానిత లక్షణాలు ప్రారంభమయ్యాయి. దీంతో మందులు వాడాడు. 24 వరకు మందులు వాడి, అదే రోజు తన భార్యతో కలసి గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇద్దరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ పాజిటివ్‌ వచ్చింది.

ఆ డాక్టర్‌ తిరుపతి నుంచి వచ్చాక తన భార్య, తల్లి, తండ్రి, తన ఇద్దరు పిల్లలతో కలసి ఉన్నాడు. భార్యకు పాజిటివ్‌ రాగా, అతడి తల్లికి మాత్రం నెగెటివ్‌ వచ్చింది. అతడి తండ్రి, ఇద్దరు పిల్లలకు సంబంధించి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే అతడికి ఎవరి నుంచి వైరస్‌ సోకిందనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వీరు పనిచేస్తున్న ఆస్పత్రిలో, ఎవరైనా ఈ డాక్టర్లను కాంటాక్ట్‌ అయితే వారు క్వారంటైన్‌లో ఉండాలని, లక్షణాలుంటే తమను సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది.

వేగంగా రెండో దశ విస్తరణ..
రాష్ట్రంలో లోకల్‌ కాంటాక్ట్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన నలుగురికి విదేశాల నుంచి వచ్చిన ఎలాంటి చరిత్ర లేదు. దేశీయంగానే వీళ్లు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో లోకల్‌గా వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య పదికి చేరింది. ఇప్పటికే, సికింద్రాబాద్‌ వ్యాపారి దంపతుల నుంచి అతడి కొడుక్కు, మణికొండకు చెందిన యువకుడి నుంచి అతడి తల్లికి, కొత్తగూడెం యువకుడి నుంచి అతడి తండ్రికి, ఇంట్లో పనిచేసే మహిళకూ వైరస్‌ వ్యాపించింది. లండన్‌ వెళ్లొచ్చిన కోకాపేటకు చెందిన వ్యక్తి, అతడి భార్యకు వైరస్‌ను అంటించాడు. కరోనా బారిన పడ్డ ఇండోనేసియావాసుల నుంచి కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడికి వైరస్‌ సోకింది.

రెండో దశ వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుండగా, మూడో దశకు సంబంధించిన ప్రమాద ఘంటికలు మొదలయ్యాయని ఈ వైరస్‌ను పర్యవేక్షిస్తున్న అధికారుల్లో ఒకరు వెల్లడించారు. ఆ డాక్టర్‌కు, మరో ఇద్దరికి ఆ వైరస్‌ ఎవరి నుంచి సోకిందన్న దానిపై స్పష్టత లేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇలా ఎవరి నుంచి వైరస్‌ సోకిందో తెలియకపోవడాన్నే మూడో దశగా పేర్కొంటారని, అది ప్రమాదకరమని అంటున్నారు. మూడో దశకు వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మంత్రి ఈటల రాజేందర్‌ సైతం గురువారం సమీక్ష నిర్వహించడం గమనార్హం. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మూడో దశకు చేరుకుంది. ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లోనూ మూడో దశకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే కేంద్రం మరో 21 రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూడా జనసామాన్యంలోకి వైరస్‌ చేరిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు హోం కార్వంటైన్‌లో ఉండకుండా ఇష్టారాజ్యంగా చాలా మందిని కలిశాడని అంటున్నారు. ఈ మొత్తం సంఘటనలపైనా, మూడో దశకు సంబంధించిన అంశాలపైనా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

వైద్య ఉద్యోగికి కరోనా లక్షణాలు..
జడ్చర్ల :  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్య ఉద్యోగికి కరోనా లక్షణాలు కన్పించడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల (కావేరమ్మపేట)లో నివాసం ఉంటూ బాలానగర్‌ పీహెచ్‌సీలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆ ఉద్యోగికి ఈ నెల 5న జిల్లా అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో డ్యూటీ వేశారు. 22న జడ్చర్లలోని తన ఇంటికి వచ్చాడు. 25న అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి పరీక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులను కూడా జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం సదరు ఉద్యోగి ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top