నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!

Iain OBrien launches fundraising appeal in bid to be reunited with family - Sakshi

కివీస్‌ మాజీ క్రికెటర్‌ ఆవేదన

క్రైస్ట్‌చర్చ్‌: ‘యూకే వెళ్లేందుకు విమాన టికెట్లకు కొంత డబ్బు కావాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్కైప్‌/ వీడియో కాల్‌ ద్వారా నాతో ఎవరైనా 20 నిమిషాలు మాట్లాడవచ్చు. క్రికెట్, రాజకీయాలు, వంటలు, మానసిక ఒత్తిడి, సచిన్‌ టెండూల్కర్‌ ఏదైనా సరే...మీకు నచ్చితే కొన్ని డాలర్లు/పౌండ్లు నాకు పంపండి’... ఒక మాజీ క్రికెటర్‌ ఆవేదన ఇది. న్యూజిలాండ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ ఇయాన్‌ ఓబ్రైన్‌ జాతీయ జట్టు తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్‌లలో అతను బుకింగ్‌ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు.

ఇప్పుడు ఎంత ఎక్కువ మొత్తమైనా ఇచ్చి వెళ్లాలనుకుంటున్నానని, దాంతో ఇలా చేయక తప్పడం లేదని అతను వాపోయాడు (2009 హామిల్టన్‌ టెస్టులో అతను సచిన్‌ను అవుట్‌ చేశాడు. అందుకే దాని గురించి కూడా ఎవరైనా అడగవచ్చని సచిన్‌ పేరు కూడా జత చేశాడు).

ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్‌ బాధపడుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top