రామగుండం అగ్నిగుండం! | Increasing temperatures in Telugu states | Sakshi
Sakshi News home page

రామగుండం అగ్నిగుండం!

May 28 2019 1:47 AM | Updated on May 28 2019 1:47 AM

Increasing temperatures in Telugu states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 4 నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, జూన్‌ రెండో వారం వరకు ఇదే రకమైన పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడే అవకాశముందని వాతావరణ కేంద్రం వర్గాలు వెల్లడించాయి. సోమవారం అత్యధికంగా రామగుండంలో 47.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్‌లో 45.8, నిజామాబాద్‌లో 45.3, మెదక్‌లో 44.8, ఖమ్మంలో 44.6, హన్మకొండలో 44, భద్రాచలంలో 43.2, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో 42.5 డిగ్రీ సెల్సియస్‌ల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 

రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఉరుము లు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement