చెత్త వేస్తే.. ఫైన్‌ కట్టాల్సిందే!

If The Garbage On the street ..fine - Sakshi

తాండూరు మున్సిపాలిటీలో కొత్త నిబంధన

వీధుల్లో చెత్తవేసిన వారిపై జరిమానా

తాండూరు : పారిశుద్ధ్యంపై మున్సిపల్‌ యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకోనుంది. వీధిలో చెత్త వేసినట్లు కనిపించిన వారికి జరిమానా వేసేందుకు మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. జులై నుంచి మున్సిపల్‌ అధికారులు పారిశుద్ధ్యంలో కొత్త నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాపారస్తులకు రూ.5 వేలు, నివాస గృహాలకు రూ.500 జరిమానా వేయనున్నారు.

తాండూరు మున్సిపల్‌ పరిధిలో 31 మున్సిపల్‌ వారుల్లో 12వేల నివాస గృహాలున్నాయి. మొత్తం సూమారు 65 వేల జనాభా ఉంది. మున్సిపల్‌ పరిధిలో ఉన్న వార్డులలో పారిశుద్ధ్యం రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వార్డుల్లోని ప్రజలకు ఇళ్లలో నుంచి చెత్తను వీధుల్లో వేయకూడదని మున్సిపల్‌ సిబ్బంది పలుమార్లు అవగహన కల్పించారు.

గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలలతో పాటు ఈ ఏడాది జనవరి నెలలో స్వచ్ఛ సర్వేక్షన్‌ పథకానికి ఎంపికయ్యేందుకు వార్డులలోని ప్రజలకు అవగహన కల్పించారు. అయినా పారిశుద్ధ్యంపై ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో ప్రధాన రోడ్డు అపరిశుభ్రంగా కనిపిస్తోంది. అయినా ఈ మార్గంలోని దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తున్నారు.

దీంతో కాలనీలు, మార్గాలు చెత్తమయంగా మారుతున్నాయి. తడి చెత్త కారణంగా పారిశుద్ధ్యం లోపిస్తుంది. చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తారని అధికారులు పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. 

చెత్త వేస్తే జరిమానా.. 

మున్సిపల పరిధిలో ఇష్టారాజ్యంగా వీధుల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో చెత్త వేస్తున్న వారిపై జరిమానా వేసేందుకు సిద్ధమయ్యారు. సెక్షన్‌ 336 మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపల్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకునే అవకాశం కల్పించింది. అందులో భాగంగా వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించేందుకు అధికారాలు ఇచ్చింది.

నివాస గృహాలకు రూ.50 నుంచి రూ.500 వరకు చెత్త వేసిన వారిపై జరిమానా విధించనున్నారు. అందుకోస మున్సిపల్‌ అధికారులు నోటీసులను ముద్రించారు. జులై నుంచి ఈ నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

స్వచ్ఛతగా మార్చేందుకే.. 

తాండూరు మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు వార్డు ప్రజలకు చెప్పినా ప్రయోజనంలేదు. వ్యాపారస్తులు రాత్రి సమయాల్లో రోడ్లపైనే చెత్త వేసి వెళ్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న వ్యాపారులపై, నివాస గృహాల ప్రజలకు జరిమానా వేస్తాం. తీరు మారకపోతే మున్సిపల్‌ చట్టం ప్రకారం కేసు పెట్టి కోర్టుకు పంపిస్తాం.  – విక్రంసింహారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్,తాండూరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top