ప్రపంచ వారసత్వ ఇరిగేషన్‌ కట్టడంగా సదర్‌మఠ్‌ 

ICID Declares Sadarmat And Pedda Cheruvu As Heritage Irrigation Structures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్‌మఠ్‌ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువును ప్రపంచ వారసత్వ ఇరిగేషన్‌ కట్టడంగా ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ (ఐసీఐడీ) గుర్తించింది. ఆగస్టు 30న కెనడాలో జరిగిన ఐసీఐడీ 69వ వార్షిక సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు ఈ నెల 9న కేంద్ర జల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. 4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్‌మఠ్‌ ఆనకట్టను 1891–92 ఏడాదిలో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఫ్రెంచ్‌ ఇంజనీర్‌ జేజే ఓట్లీ డిజైన్‌ చేశారు. దీనికింద 13,100 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, దీన్ని 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్‌ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన ప్రతిపాదనకు ఐసీఐడీ ఆమోదం తెలిపింది. ఇక కామారెడ్డిలోని పెద్ద చెరువును 1897లో నిర్మించారు. దీని కింద 858 ఎకరాలు సాగవుతోంది. ఇటీవలే మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో దీన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. దీన్ని సైతం వారసత్వ కట్టడంగా గుర్తించాలని ప్రతిపాదించగా.. గ్రీన్‌సిగ్నల్‌ దక్కింది. వారసత్వ కట్టడాలుగా సదర్‌మఠ్, పెద్ద చెరువును ప్రకటించడంపై మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ నాగేందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top