
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఒక ఆనకట్ట కూలి ఆకస్మిక వరద సంభవించడంతో, నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆనకట్ట కూలిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ధనేష్‌పూర్ గ్రామంలో ఉన్న లూటి జలాశయంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
1980ల ప్రారంభంలో నిర్మించిన ఈ జలాశయంలో వరద పోటెత్తడంతో సమీపంలోని ఇళ్లు, వ్యవసాయ పొలాలోకి నీరు వచ్చిచేరింది. సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల సీఎం బస్తర్ డివిజన్‌లోని వరద ప్రభావిత బస్తర్, దంతేవాడ జిల్లాలను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దంతేవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీటమునిగాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన వరదలకు ఎనిమిది మంది మరణించారు, 96 పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు 495 ఇళ్లు, 16 కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దంతేవాడలోని చుడితిక్ర వార్డులోని సహాయ శిబిరంలో తలదాచుకున్న నిర్వాసితులను ముఖ్యమంత్రి పరామర్శించారు.