ప్రజా రవాణాకే ప్రాధాన్యం

Hyderabad Women Use Public Transport System - Sakshi

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్, పర్యావరణహిత రవాణాకే మహిళల మొగ్గు

ఫుట్‌పాత్‌లు, సైకిళ్ల వినియోగం పెరగాలి

నగరాల్లో స్త్రీల రవాణా సదుపాయాలపై ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్‌ సర్వేలో వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో:  ప్రజా రవాణా సదుపాయాలకే మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పారదర్శకమైన, సురక్షితమైన, చివరి గమ్యం వరకు చేర్చే రవాణా సదుపాయాలు మరింత  విస్తృతం కావాలని వారు కోరుకుంటున్నారు. నగరంలోని రవాణా సదుపాయాల తీరుపై ఓలా మొబిలిటీ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది మహిళలు, విద్యార్థినులు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ రవాణా సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని 11 నగరాల్లో ఓలా సంస్థ ఈ సర్వేను చేపట్టింది. మొత్తం 9,935 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారిలో అత్యధిక మంది బస్సులు, మెట్రో రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణ సదుపాయాలతో పాటు, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీని కోరుకున్నట్లు సర్వే వెల్లడించింది. 59 శాతం మంది ఏదైనా పబ్లిక్‌ ట్రా న్స్‌పోర్టును కోరగా, 38 శాతం మంది  బస్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మరో 35 శాతం మంది ఎంఎంటీఎస్, మెట్రో వంటి సర్వీసులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 నుంచి  45 శాతం మంది  ఆటో రిక్షాలు, షేరింగ్‌ వాహనాలు, క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు.

చార్జీలు తక్కువ
వ్యక్తిగతంగా వాహనాల వినియోగానికయ్యే ఖర్చు కంటే  ప్రజా రవాణా వాహనాల్లో చార్జీలు భరించగలిగే స్థాయిలో ఉండడం వల్లనే వాటిలో ప్రయాణం చేస్తున్నట్టు 96 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. పైగా అన్ని రూట్లలో ఇవి అందుబాటులో ఉండడం, సమయపాలన, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు చాలా మంది మహిళలు పర్యావరణహిత రవాణా సదుపాయాల ప్రాధా న్యతను గుర్తించారు. పర్యావరణానికి వాహన కాలుష్యం ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో పర్యావరణ రక్షణకు దోహదం చేసే రవాణా సదుపాయాలు ఎంతో అవసరమని  95 శాతం మంది మహిళలు, అమ్మాయిలు తెలిపారు. బైస్కిల్స్‌ వినియోగం పెరగాలని, నాన్‌మోటార్‌ ట్రాన్స్‌పోర్టు విరివిగా అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. మరో 74 శాతం మంది ఫుట్‌ఫాత్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. మహిళలు రవాణాకు తాము మరింత నాణ్యమైన, మెరుగైన రవాణ సదుపాయాలను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఓలా మొబిలిటీ ఇన్‌స్టిట్యూట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ షా తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top