‘విశాఖ’ వేదన!

Hyderabad Railway Employees Worried About Visakhapatnam Railway Zone - Sakshi

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుతో ఉద్యోగుల్లో ఆందోళన

ప్రధాన కార్యాలయాల్లో సగం ఉద్యోగులు బదిలీ!

రైల్‌నిలయంలో మొదలైన హడావుడి

ఇక్కడ స్థిరపడ్డాక ఎలా వెళతామంటూ ఆవేదన

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే విభజన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం. గణాంకాల కార్యాలయం లేఖాభవన్,  రైల్‌ నిర్మాణ్‌ భవన్‌ వంటి  ప్రధాన పరిపాలన, నిర్వహణ కేంద్రాల్లో గురువారం  ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కొత్తగా ఏర్పాటు కానున్న  దక్షిణ కోస్తా  రైల్వే, పాత దక్షిణమధ్య రైల్వేల  మధ్య ఉద్యోగుల విభజన తప్పనిసరి కావడంతో అన్ని ప్రధాన కేంద్రాల్లో విభజన అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ కేంద్రంగా పని చేసిన అధికారులు, ఉద్యోగులు  ఇప్పుడు ఏపీకి తరలి వెళ్లవలసి రావడంతో ఉద్వేగానికి గురవుతున్నారు. మొదటి దశలో ఆప్షన్‌లు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్‌లు ఉండకపోవచ్చునని, తప్పనిసరిగా విశాఖ జోన్‌కు వెళ్లవలసి వస్తుందని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా  హైదరాబాద్‌లో పని చేస్తూ  ఇక్కడే స్థిరపడి సొంత ఇళ్లు, ఆస్తులు సంపాదించుకొన్న వారు ఇప్పుడు ఉన్నఫళంగా  కొత్త జోన్‌కు వెళ్లవలసి రావడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘చాలా కాలంగా పని చేస్తూ సొంత ఊళ్లనే మరిచిపోయాం. ఇప్పుడు ఎక్కడికి  వెళ్లాలి. తిరిగి  ఎక్కడ స్థిరపడాలి.  చాలా గందరగోళంగా  ఉంది.’’ అని రైల్‌నిలయంలో  పని చేస్తున్న  అధికారి ఒకరు విస్మయం  వ్యక్తం చేశారు. నగరంలోనే  హైదరాబాద్‌  డివిజన్‌ , సికింద్రాబాద్‌ డివిజన్‌ల  ప్రధాన కార్యాలయాలు ఉన్నప్పటికీ  విభజన ప్రభావం డివిజనల్‌ ఉద్యోగులపైన ఉండబోదు. కేవలం  జోనల్‌ కార్యాలయాల్లో పని చేసే  అధికారులు, ఉద్యోగులు మాత్రమే రెండు జోన్‌ల మధ్య  బదిలీ కావలసి ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు, ఉద్యోగులు, విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నప్పటికీ  వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లే ఎక్కువ సంఖ్యలో  ఉన్నారు. 

రైల్‌నిలయంపై  ప్రభావం...
దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌నిలయంలో సుమారు  1500 మంది ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పని చేస్తున్నారు. జోన్‌లోని మొత్తం 6 డివిజన్‌ల కార్యాలకలాపాలను  ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. పరిపాలన, మానవ వనరుల విభాగం, ఆపరేషన్స్, విజిలెన్స్, ప్రజాసంబంధాలు, కమర్షియల్, తదితర విభాగాలతో పాటు, ఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం కూడా రైల్‌నిలయంలోనే ఉంది. విభజన నేపథ్యంలో సుమారు  750 మందికి పైగా  విశాఖ జోన్‌కు తరలి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రైల్‌నిలయంలోని ఏడంతస్థుల భవనంలో సగానికి పైగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేత  అరుణ్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు  తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంత భాగాన్ని రైల్‌నిలయం కేంద్రంగా  దక్షిణమధ్య రైల్వే నిర్వహిస్తుంది. విభజన అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్‌లు మాత్రమే దీని పరిధిలో ఉంటాయి. ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది.అలాగే  దక్షిణమధ్య రైల్వేలో కొత్త లైన్‌ల నిర్మాణం, కొత్త భవనాలు, కట్టడాలు,తదితర కార్యాలయాలను చేపట్టి పర్యవేక్షించే  రైల్‌నిర్మాణ్‌ భవన్‌లో సుమారు  650 మంది పని చేస్తున్నారు. లేఖా భవన్‌లో మరో  500 మందికి పైగా ఉన్నారు. ఈ రెండు కార్యాలయాల్లోనూ సగం మంది కొత్త జోన్‌కు తరలి వెళ్లవలసిందే. 

తగ్గనున్న ఏ–1 స్టేషన్‌లు...
జోన్‌ విభజన దృష్ట్యా  దక్షిణమధ్య రైల్వే జోన్‌లో  ఏ–1 స్టేషన్‌ల సంఖ్య తగ్గనుంది. విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్‌లు కొత్త జోన్‌కు బదిలీ అవు తాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లు మాత్రమే మిగులుతాయి.దీంతో  రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి  నిధులు తగ్గే అవకాశం ఉన్న ట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి.  సికింద్రాబాద్‌ డివిజన్‌ ఒక్కటే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్‌గా మారింది. కొత్తగా కాజీపేట్‌ డివిజన్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని  మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు అరుణ్‌ కోరారు.

విశాఖ–సికింద్రాబాద్‌నెట్‌వర్క్‌ పెరిగే అవకాశం  
దక్షిణమధ్య రైల్వే విభజన పట్ల ఉద్యోగ వర్గాల్లో కొంత విముఖత ఉన్నప్పటికీ  కొత్త జోన్‌ వల్ల  ప్రయాణికులకు మరిన్ని అదనపు రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని  భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ  అత్యధికంగా ఉండే ఈ కారిడార్‌లో కొత్త రైళ్లను విశాఖ వరకు పొడిగించేందుకు అవకాశం లేకపోవడంతో కాకినాడ నుంచే మళ్లిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేకు, దక్షిణమధ్య రైల్వేకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఉత్తరాంధ్రకు  హైదరాబాద్‌ నుంచి  కనెక్టివిటీ పెరగడం లేదు. కొత్త రైళ్లు నడపాలని  అనేక ఏళ్లుగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఈస్ట్‌కోస్ట్‌ నుంచి సహకారం లభించకపోవడంతో వాయిదా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సౌత్‌కోస్ట్‌ రైల్వే, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలు రెండు  తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్న దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరిగే అవకాశం ఉంది.  

ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తారు
ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంత ఉన్న పళంగా జోన్‌ పైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయాం. ఇప్పటికిప్పుడు  జోన్‌ విభజించడం వల్ల ఉద్యోగులు, వారి పిల్లలు ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడ చదువుకోవాలి. చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ల పరిస్థితి ఏంటీ. చిన్న జోన్‌ల వల్ల రైల్వేకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండబోదు.     – ఉమా నాగేంద్రమణి,    దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌

ఆందోళన మొదలైంది
జూనియర్‌ ఉద్యోగుల్లో అప్పుడే  ఆందోళన కనిపిస్తోంది. ఆప్షన్‌లు ఇస్తామంటారు కానీ, కిందిస్థాయికి వచ్చేటప్పటికీ బలవంతపు బదిలీలు తప్పవు. పారదర్శకత పాటించాలి.  ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే వారిపైన ప్రభావం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.– అరుణ్‌కుమార్, సహాయ ప్రధాన కార్యదర్శి, మజ్దూర్‌ యూనియన్‌    

నిరుద్యోగం అలాగే ఉంటుంది
విశాఖ పట్నంలో కొత్త రైల్వే  జోన్‌  ఏర్పాటును   ఆంధ్ర ప్రజలు  ఆహ్వానించినప్పటికీ ,  అక్కడవున్న  నిరుద్యోగ సమస్య పూర్తిగా  తొలగిపోదు.  జోన్‌ రాకతో  ముఖ్య  కార్యాలయానికి  మాత్రమే అధికారులు,సిబ్బంది  అవసరం ఉంటుంది.  గుంతకల్‌ , విజయవాడ , గుంటూరు  డివిజన్‌ లో పని చేస్తున్న స్టాఫ్‌ యధావిధిగా వుంటారు. ఏ రైల్వే నుండైనా  బదిలీలపై వచ్చే అవకాశం ఉంటుంది.  వేరే చోట పని చేస్తున్న అధికారులు అనధికారులు కొత్త జోన్‌ కు రావడానికి ప్రయత్నిస్తారు. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడివి.     – నూర్, దక్షిణమధ్య రైల్వే రిటైర్డ్‌ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top