
సచివాలయాల ఉద్యోగుల్లో 70 శాతానికి పైగా ఈసారి స్థానచలనం
ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ
ఈనెల 30లోగా బదిలీల ప్రక్రియ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న 72 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. దాదాపు 80 వేల మంది సచివాలయాల ఉద్యోగులకు ఈ విడతలో బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఒకేచోట ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోకపోయినా వారు బదిలీకాక తప్పదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు.. రిక్వెస్టు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి శనివారం ఉదయం నుంచి ప్రత్యేక వెబ్‌పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్పారు.
70 శాతానికి పైగా బదిలీ..
ప్రస్తుతం 1.09 లక్షల మంది ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఈ ఏడాది 70 శాతం మందికి పైగా స్థానచలనం ఉంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈనెల 30లోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
ఆఫ్‌లైన్ విధానంలోనే బదిలీల ప్రక్రియ..
ఈసారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో చేపట్టింది.
అయితే, ఇప్పుడు ఒకే విడతన దాదాపు 80 వేల మందిని ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించడమంటే, భారీగా పైరవీలకు తెరలేపినట్లేనని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేసే అవకాశముందని.. దీనివల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.