
జూన్ 30తో ముగిసిన గడువు
జూలై 5వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ గడువు గత 30వ తేదీన ముగియగా.. ఆ గడువును జూలై 5(శనివారం) వరకు పొడిగిస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలో శనివారం వరకు పొడిగిస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, అధికార నాయకుల సిఫార్సుల మేరకు అన్యాయంగా బదిలీలు చేశారంటూ గత నాలుగు రోజులుగా సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
గ్రామ వార్డు సచివాలయాల్లోపనిచేసే ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులుగా గుర్తించిన వారిలో 130 మందిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంటర్లలో నియమించేందుకు అనుమతి తెలుపుతూ ప్రభుత్వం శనివారం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా కేంద్రాల్లో వీరికి డిప్యూటేషన్ మీద ఈ నియామకాలు చేపట్టనున్నట్టు పేర్కొంది.