హైదరాబాద్‌లో కట్టల కట్టలు డబ్బు పట్టివేత

Hyderabad Police Seized Over Seven Crores In cash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో ఓ అపార్ట్‌మెంట్‌లో 7 కోట్ల 71 లక్షల 25 వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఇద్దరు అనుమానితులు దొరికారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నగదును గుర్తించారు. అయితే తాము దిగుమతి, ఎగుమతి వ్యాపారం చేస్తున్నామని పోలీసులకు నిందితులు తెలిపారు.

ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంట్లో ఎందుకు ఉంచారన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోవడంతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కంపెనీ సంబంధించిన వివరాలు లేకపోవడంతో రాజ్ పురోహిత్, సునీల్‌కుమార్ ఆహుజ, ఆశిష్ కుమార్ ఆహుజ, మహుమ్మద్ అజాంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రివాల్వర్‌, వొల్వో కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 171(బీ), 468, 471, 420, 120(బీ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ, ముంబై నుంచి హవాలా మార్గంలో డబ్బును తీసుకొచ్చివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ నాయకులెవరైనా ఈ డబ్బును తెప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top