పాస్‌పోర్ట్‌ల జారీలో టాప్‌–10లో తెలంగాణ | Hyderabad Passport Office Is In Top 10 Position | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ల జారీలో టాప్‌–10లో తెలంగాణ

Jul 14 2019 2:47 AM | Updated on Jul 14 2019 2:47 AM

Hyderabad Passport Office Is In Top 10 Position - Sakshi

హైదరాబాద్‌: అత్యధిక పాస్‌పోర్ట్‌ల జారీలో తెలం గాణ టాప్‌–10లో నిలిచిందని హైదరాబాద్‌ ప్రాం తీయ పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలి పారు. ఇక అత్యంత వేగంగా పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియను సరళీకృతం చేయడం వల్లే ఎక్కువ మందికి సేవలందించటం సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబాల కోసం శని వారం ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ రీత్యా సమయాభావం వల్ల పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలకు రాలేని పట్టణ వాసుల కోసం ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగం గానే ప్రెస్‌క్లబ్‌ తరఫున రెండోసారి మేళా నిర్వహించ గా దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు ప్రెస్‌క్లబ్‌ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో దేశవ్యాప్తంగా 414 పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ప్రారంభిం చగా, హైదరాబాద్‌ రీజినల్‌ పరిధిలో 14 సెంటర్లను కొత్తగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఆయా సెంటర్లకు 2018లో 45,000, 2019 జూన్‌ నాటికి 35, 000 పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు వచ్చాయన్నారు. 

గతంకంటే భిన్నంగా.. 
గతంలో నివాసం ఎక్కడ ఉంటే అక్కడ సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించి పాస్‌పోర్ట్‌లు జారీ చేసేవారని, ఇప్పుడా పద్ధతికి స్వస్తి చెప్పి శాశ్వత చిరునామా ఎక్కడ ఉన్నా ప్రస్తుత నివాసప్రాంతం నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. పోలీసుల పరిశీలన మాత్రం ప్రస్తుత చిరునామాలోనే జరుపుతారని, కొన్ని సందర్భాల్లో మాత్రమే శాశ్వత చిరునామాలో పరిశీలన జరుపుతున్నట్లు వెల్లడించారు. 2018 ఏడాదికి గాను 5,49,000 దరఖాస్తులు రాగా అందులో 5,20,000 మందికి, 2019 జూన్‌ వరకు 2,82,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2,69,000 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేశామని తెలిపారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పోలీసు పరిశీలన తెలంగాణలో నాలుగు రోజుల్లో, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల్లోను పూర్తవుతుందన్నారు. పాస్‌పోర్ట్‌ల పెండింగ్‌ తగ్గుముఖం పట్టిందన్నారు. 

రెండున్నర ఎకరాల్లో విదేశీ భవన్‌
శిల్పారామం ఎదురుగా విదేశీ భవన్‌ ఏర్పాటుకు రెండున్నర ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి విష్ణువర్దన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భవన్‌ నిర్మాణానికి అవసరమైన ప్లానింగ్‌ పనిలో కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఉన్నారన్నారు. ఈ ఏడాది చివరికల్లా భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సమావేశంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, పాస్‌పోర్ట్‌ కార్యాలయ డీపీఓ ఇందుభూషణ్‌ లింకా తదితరులు పాల్గొన్నారు. 

ఫేక్‌ వెబ్‌సైట్లతో మోసపోవద్దు
పాస్‌పోర్టు ఇప్పిస్తామని కొన్ని వెబ్‌సైట్లు అమాయకులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల విభాగం దృష్టికి తీసుకెళ్తామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ఫేక్‌వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి సంబంధించి   parrporti ndia.-gov.in  మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌గా ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్టు పొందేందుకు రూ.1500 మాత్రమే చెల్లించాలని, అంతకంటే ఎక్కువ డబ్బులు అడిగితే ఆ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీటు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఉన్న ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో చిప్‌ బేస్డ్‌ పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement