శోభాయాత్ర సాగే మార్గాలివే..!

Hyd Traffic Additional CP Anil Kumar Press Meet Over Ganesh Nimajjanam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగ వద్దకు చేర్చేందుకు చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. నగరం మొత్తంలో ఇప్పటివరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తొమ్మిదో రోజు 7 నుంచి 8 వేల వరకు గణనాథులు నిమజ్జనమయ్యే అవకాశముంది. 11వ రోజు బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర 17 ప్రధాన రహదారుల్లో కొనసాగగా 10 వేల లారీలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.

అలియాబాద్‌, నాగుల్‌చింత, చార్మినార్‌, మదీన, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌ బాగ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు విదేశాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇక నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్రైవేటు వాహనాలకు శోభాయత్రలో అనుమతి ఉండదు. ప్రతి ఒక్కరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలి’ అని సూచించారు.

‘వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 10 పార్కింగ్‌ స్థలాల్ని ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ, గోసేవ సదన్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, నిజాం కాలేజ్‌, ఎంఎంటీఎస్‌ ఖైరతాబాద్‌ స్టేషన్‌, బుద్ధభవన్‌ వెనుక, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, పబ్లిక్‌ గార్డెన్‌లో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాం. ఇక నిర్దేశించిన మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. మొత్తం 13 గంటలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. చిన్న విగ్రహాలు ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లకుండా చూస్తాం. శుక్రవారం ఉదయానికల్లా ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరిస్తాం. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై  రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ట్యాంక్‌బండ్‌పై వన్‌వేకు అనుమతి ఇస్తాం. ప్రజలు సహకరించాలి’ అని అనిల్‌ కుమార్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top