
చిత్రపురి కాలనీలో నూతన ప్రాజెక్ట్ ‘సఫైర్ సూట్’ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ భూమి పూజ త్వరలో జరుగుతుందని, 40 నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని, రూ.166 కోట్ల అప్పు, బఫర్ జోన్ సమస్యలను అధిగమించి అందరికీ ఇళ్లు అందించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
‘చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాము. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉండే ఎన్నో వేల మంది సమస్యలు పరిష్కరింపబడతాయి’అని సీ కల్యాణ్ అన్నారు.
‘చిత్రపురి కాలజీ స్థలం వేలానికి వెళ్ళిన సమయంలో చదలవాడ శ్రీనివాసరావు గారు వచ్చి మనకోసం అండగా నిలబడ్డారు. అలాగే భారత భూషణ్ గారు ప్రభుత్వాలతో ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఈ ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్లేందుకు సహాయపడ్డారు. ఈ సమస్యను ఛాంబర్ లోని వారంతా మన సమస్యగా అనుకుని కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. కమిటీ వారందరికీ మరోసారి ధన్యవాదాలు’అని నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు.
బ్రోచర్ విడుదల చేసిన ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్ తదితరులు పాల్గొని, ప్రాజెక్ట్ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సభ్యులకు ప్రాధాన్యత, కొత్త సభ్యులకు ధృవీకరణ పత్రాలతో మెంబర్‌షిప్ ఇవ్వనున్నారు.