
మారేడుపల్లి : తరచుగా ఫోన్‌లో ఛాటింగ్ చేస్తున్న భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన మేరకు.. సంజీవయ్యనగర్‌కు చెందిన శివకుమార్ అలియాస్ చిన్నా (27) ఎలక్ట్రీషియన్. ఇతనికి గత నెల ఆగస్టు 15న లహరి అనే యువతితో వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. శివకుమార్ తరచుగా ఫోన్‌లో ఛాటింగ్ చేస్తుండడంతో భార్య మందలించింది.
మూడు రోజులుగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం శివకుమార్ మరోరూమ్‌లోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంతకూ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో తలుపులను పగులగొట్టి చూడగా శివకుమార్ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే శివకుమార్ మరణించడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై బోరున విలపించారు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.