పిడికెడు మెతుకుల కోసం బడి మెట్లు ఎక్కితే..

Hungry Girl Outside Classroom Gets Her Admission In Same School - Sakshi

లోకంలో పట్టెడన్నం కోసం పడిగాపులు కాచేవారు ఎందరో.. ఇక్కడ మనం చెప్పుకునే ఈ చిన్నారి కూడా ఆ కోవకు చెందిందే. మోతి దివ్య ఉండేది మురికివాడలో. బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకోడానికి వెళ్తే.. ఆకలితో పల్లెం పట్టుకుని తన ఈడు పిల్లలుండే చోటుకు వడివడిగా అడుగులు వేసేది. పట్టెడు మెతుకులు దొరక్కపోతాయా అని గంపెడాశతో మధ్యాహ్న భోజన సమయానికి బడి మెట్లెక్కేది. మధ్యాహ్నం బడి గంట ఎప్పుడు కొడతారా అని చేతిలో ఖాళీ గిన్నెతో ఆతృతగా ఎదురు చూసేది. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతిరోజూ ఇదే తంతు. లోపల మిగతా పిల్లలందరూ స్కూలు బట్టలు ధరించి పాఠాలు వింటుంటే అక్కడే ఉన్న వారి వంక ఓసారి, వారి బ్యాగుల వంక తరచి తరచి చూస్తుండేది.. పిడికెడు మెతుకులైనా దొరక్కపోతాయా అని. ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఓ జర్నలిస్ట్‌ క్లిక్‌మనిపించగా కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న విషయాన్ని అక్షరాలా పాటించాడో వ్యక్తి. వెంకట్‌ రెడ్డి అనే సామాజిక కార్యకర్త ఎవరైనా ఆమెకు సహాయం చేస్తే బాగుండు అనుకోలేదు. నేనే ఎందుకు ముందడుగు వేయకూడదు అనుకున్నాడు. వెంటనే మరి కొంతమంది సహాయంతో ఆమె ఆచూకీ కనుగొన్నాడు. ఎక్కడైతే వేయిచూపులతో అంటరానిదానిలా ఆకలి తీర్చుకోడానికి నిరీక్షగా ఎదురు చూసిందో అదే పాఠశాలలో ఆమెను జాయిన్‌ చేశారు. దీంతో ఆమెకు తిండితో పాటు చదువు కూడా సొంతం అయింది. ఇప్పుడామె హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న దేవల్‌ ఝామ్‌ సింగ్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థి. అందరు పిల్లల్లాగే ఆమె కూడా స్కూలు దుస్తులను వేసుకుంది. తన తల్లిదండ్రుల సమక్షంలో మొదటిసారిగా బడిలోకి విద్యార్థిగా అడుగుపెట్టింది. ఈ ఘటన.. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించిందని పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top