జిల్లా పరిషత్ ‘హస్త’గతం? | Hung situation in Zilla Parishad elections | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్ ‘హస్త’గతం?

May 14 2014 1:08 AM | Updated on Mar 18 2019 9:02 PM

మూడు దశాబ్దాలుగా జిల్లా పరిషత్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తెలుగుదేశం పార్టీ ప్రాబల్యానికి గండిపడింది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మూడు దశాబ్దాలుగా జిల్లా పరిషత్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తెలుగుదేశం పార్టీ ప్రాబల్యానికి గండిపడింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆ పార్టీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఫలితంగా ఈసారి జెడ్పీలో నామమాత్ర పాత్రకే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్ర విభజన అనంతరం మారిన సమీకరణలు టీడీపీ నడ్డి విరిచాయి. కీలక నేతలు వలసబాట పట్టడంతో సైకిల్ హవాకు బ్రేకు పడింది. జిల్లాలో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్ భారీ స్థాయిలో టీడీపీ ఓట్లకు గండి కొట్టింది. గతంలో ఆ పార్టీ సాధించిన సీట్లలో అత్యధిక టీఆర్‌ఎస్ పాగా వేయగా, మిగతా సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ బలహీనపడడాన్ని అవకాశంగా మలుచుకున్న కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుచుకోగలిగింది.

 13 చోట్ల కాంగ్రెస్?
 మంగళవారం వెలువడ్డ జిల్లా ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మునుపటి జోరును కొనసాగించింది. కడపటి వార్తలందేసరికి అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, మరికొన్ని స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. 33 జెడ్పీటీసీ స్థానాలున్న జిల్లా పరిషత్‌ను దక్కించుకోవాలంటే 17 జెడ్పీటీసీ సభ్యుల బలం తప్పనిసరి. అయితే, కాంగ్రెస్‌కు కూడా సంపూర్ణ మెజార్టీ దక్కే అవకాశాలు లేనప్పటికీ, అత్యధిక సీట్లు సాధించినందున పాగా వేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎదురులేని అధిక్యతను సాధించింది.

ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి నవాబ్‌పేట జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. కుల్కచర్లలో ఆ పార్టీ 50 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఊహించని రీతిలో టీఆర్‌ఎస్ జిల్లా పరిషత్‌లో విజయాలను నమోదు చేసింది. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీ తిరుగులేని అధిక్యతను కనబరిచింది. తాండూరు, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్లను దాదాపు స్వీప్‌చేసిన టీఆర్‌ఎస్, తూర్పు ప్రాంతంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఘట్‌కేసర్‌లో మాత్రం రెండో రౌండ్ పూర్తయ్యేసరికి  2,450 ఓట్ల అధిక్యతలో కొనసాగుతోంది.

 10 చోట్ల కారు జోరు
 తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి యాలాల నుంచి విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గాల్లో మూడు మండలాలను కైవసం చేసుకున్న ఆపార్టీ పరిగిలోనూ అదే దూకుడును ప్రదర్శించింది. గతంలో టీడీపీలో కొనసాగిన కొన్నాళ్ల క్రితం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం చొరవతో జిల్లాలో గులాబీ వికసించింది. మరోవైపు చైర్మన్  పీఠంపై మరోసారి తన సతీమణి సునీతను కూర్చోబెట్టాలని భావిస్తున్న మహేందర్‌రెడ్డి తాజా ఫలితాల నేపథ్యంలో ఇతర పార్టీల నేతల మద్దతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలను ఆసరా చేసుకొని జెడ్పీ కుర్చీని దక్కించుకునేందుకు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

 సైకిల్ పంక్చర్
 జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆ పార్టీ కేవలం ఆరు చోట్ల విజయం సాధించగా, మరో రెండు చోట్ల ప్రత్యర్థులతో పోటీపడుతోంది. నగర శివార్లలో కాస్తోకూస్తో పట్టు నిలుపుకున్న ఆ పార్టీ.. పశ్చిమ ప్రాంతంలో చతికిలపడింది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ చెప్పుకోదగ్గస్థాయిలో విజయాలను నమోదు చేసింది. ఇక మంచాలలో అనూహ్యంగా సీపీఎం పుంజుకుంది. పూర్వైవె భవాన్ని సంపాదించుకున్న ఆ పార్టీ కడపటి వార్తలందేసరికి జెడ్పీటీసీ స్థానంలో ముందంజలో నిలిచింది. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం కాగా, యాచారంలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా అర్ధరాత్రి వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ మొదలు కాలేదు.  

 కాంగ్రెస్: నవాబ్‌పేట, పెద్దేముల్, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, మొయినాబాద్, మర్పల్లి, ధారూరు, శామీర్‌పేట, బంట్వారం, మోమిన్‌పేట, శంషాబాద్, కందుకూరు

 టీఆర్‌ఎస్: గండేడ్, దోమ, యాలాల, బషీరాబాద్, తాండూరు, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, పూడూరు. షాబాద్, ఘట్‌కేసర్
 టీడీపీ: కీసర, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement