రాజస్తాన్‌లా తెలంగాణ కాకూడదు 

High Court to support the construction of water tank in the park land - Sakshi

బిందెడు నీళ్ల కోసం అక్కడ కిలోమీటర్లు నడిచివెళతారు

పార్కుస్థలంలో వాటర్‌ట్యాంక్‌ నిర్మాణాన్ని సమర్థించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: నీటికోసం అల్లాడుతున్న ప్రజల అవసరాలకోసం వాటర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేస్తుంటే, దానిని అడ్డుకోవాలని కోరడం ఎంత మాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజస్తాన్‌లో మహి ళలు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళుతుంటారని, నిత్యం అక్కడ నీళ్లకోసం కొట్లాటలు కూడా జరుగుతుంటాయని గుర్తు చేసింది. అటువంటి పరిస్థితులు తెలంగాణలో రాకూడదని తాము కోరుకుంటున్నామంది. వాటర్‌ట్యాంక్‌ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోలేమంటూ అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

నిజామాబాద్‌లోని వినాయక్‌ నగర్‌ శ్రీసాయి ఎన్‌క్లేవ్‌ బస్వగార్డెన్స్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో చేపట్టిన వాటర్‌ట్యాంక్‌ నిర్మాణాన్ని సవాలు చేస్తూ వి.దీవానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  సింగిల్‌ జడ్జి విచారణ జరిపి వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం కూడా ప్రజల అవసరాల కోసమేనని, అందు లో తప్పేమీ లేదంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దీవానా ఏసీజే నేతృత్వంలోని ధర్మా సనం ముందు అప్పీల్‌ చేశారు. పార్క్‌ స్థలంలో వాటర్‌ట్యాంక్‌ నిర్మాణం నిబంధనలకు విరు ద్ధమన్నారు. ఈ ట్యాంక్‌ వల్ల పచ్చదనం లేకుం డా పోతుందన్నారు.

ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. నీటి కోసం జనం అల్లా డుతున్న విషయం పిటిషనర్‌కు తెలిసినట్లు లేదు, ఓ మూడు వారాలపాటు నీళ్లు లేకుండా గడిపితే అప్పుడు నీటి విలువ ఏమిటో పిటిషనర్‌కు తెలిసి వస్తుందని వ్యాఖ్యానించింది. నీటి కష్టాలు ఎలా ఉంటాయో  రాజస్తాన్‌లో చూడాలని వ్యాఖ్యానించింది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు వాటర్‌ట్యాంక్‌లు నిర్మిస్తే, వాటిని అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదంది. దీవానా అప్పీల్‌ను కొట్టేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top