రియల్‌ లైఫ్‌ విలన్లు వేరుగా ఉంటారు

High Court reserves verdict on Prabhas plea - Sakshi

సినీ నటుడు ప్రభాస్‌ కేసులో ధర్మాసనం వ్యాఖ్యలు

తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: సినీనటుడు ప్రభాస్‌ భూమి విషయంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావుల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. పిటిషనర్‌ (ప్రభాస్‌) రీల్‌ లైఫ్‌ (సినిమా)లో విలన్లను ఎదుర్కొని ఉండొచ్చునని, రియల్‌ లైఫ్‌లో విలన్లు వేరుగా ఉంటారని తెలుసుకోవాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నెంబర్‌ 5/3లో తనకున్న భూమిని అధికారులు ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి గేటుకు తాళం వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు గురువారం దానిని మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ భూమిని పిటిషనర్‌ చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. ఆ భూమిలో పిటిషనర్‌ నిర్మాణాలు కూడా చేశారన్నారు. అధికారులు సుప్రీంకోర్టు తీర్పు అంటూ తమ భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, గేటుకు తాళం వేశారని చెప్పారు.

తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ, పిటిషనర్‌ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌ చేయించుకోలేదన్నారు. ఆ భూమిలో చేపట్టిన నిర్మాణాలకు అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. క్రమబద్ధీకరణ దరఖాస్తును కూడా తిరస్కరించామని, ఇదే విషయాన్ని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేర్కొన్నామన్నారు. అందుకే రాతపూర్వకంగా ఆ విషయాన్ని పిటిషనర్‌కు తెలియచేయలేదన్నారు. పిటిషనర్‌ ఆ భూమిని సర్వే నంబర్‌ 5/3లో ఉందని చెబుతున్నారని, అది సర్వే 46 అని ఆయన వివరించారు.  

దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ సర్వే నంబర్‌ 46లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఇప్పటికే 84 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బడా వ్యక్తులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రికార్డుల్లో మార్పులు చేసుకుంటున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘తమ భూమి గేటుకు అధికారులు తాళం వేశారని ఫిర్యాదు చేస్తూ ఎవరైనా పేదవాడు కోర్టుకు వచ్చుంటే మేం  జోక్యం చేసుకుని ఉండేవాళ్లం. తాళం తీసి బయటకు వెళ్లాలని అధికారులను ఆదేశించే వాళ్లం. అయితే ఇందులో పిటిషనర్‌ న్యాయపోరాటం చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టగలరు. అందుకే మేం స్టే ఇవ్వడం లేదు. దీని అర్థం స్థితి మంతుల విషయంలో కోర్టు ఇలా వ్యవహరిస్తుందని కాదు. ఎవరి విషయంలోనైనా చట్టం ప్రకారమే నడుచుకుంటాం’ అని ధర్మాసనం తెలిపింది.

తెలియక కొనుగోలు చేసుండొచ్చు
శరత్‌ తన వాదనలు కొనసాగిస్తూ, ఆ భూమిపై హక్కు ఉందని భావిస్తే, సివిల్‌ కోర్టుకు వెళ్లవచ్చునన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ భూమి అని తెలియక పిటిషనర్‌ ఆ భూమి కొనుగోలు చేసి ఉంటారు. పిటిషనర్‌ నిర్మించిన భవనాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథస్థితి ఆదేశాలను కొనసాగిస్తున్నామంది. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top