నిష్పాక్షిక విచారణ జరపండి

High Court key command on Medical education entries in NCC quota - Sakshi

ఎన్‌సీసీ కోటా వైద్య విద్య ప్రవేశాలపై హైకోర్టు కీలక ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఎన్‌సీసీ కోటా కింద భర్తీ చేసిన సీట్ల విషయంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ రోవిన్‌ను విచారణాధికారిగా నియమించే విషయంలో ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. సీట్ల భర్తీకి సంబంధించి ఎన్‌సీసీ అధికారులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరపండి. పిటిషనర్లు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. మాకు విశ్వాసం కలిగించేలా విచారణ జరగని పక్షంలో పిటిషనర్లు కోరిన ప్రత్యామ్నాయంవైపు మేం మొగ్గు చూపుతాం.

ఈనెల 10వ తేదీ కల్లా విచారణను పూర్తి చేసి నివేదికను మా ముందుంచాలి’’అని విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎన్‌సీసీ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు ఈ విచారణ గురించి తెలియజేయాలని, వారికి ఇచ్చిన ప్రవేశాలు తాత్కాలికమని, విచారణ నివేదిక ఆధారంగా వారి కొనసాగింపు ఉంటుందని స్పష్టంగా చెప్పాలని ఉభయ రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

అధికారుల తీరు సరికాదు..: ‘‘ఎన్‌సీసీ కోటా కింద సీట్లు పొందేందుకు మేం అర్హులమైనప్పటికీ, ఎన్‌సీసీ అధికారుల తీరు వల్ల మాకు అన్యాయం జరిగింది. ప్రాధాన్యత ఖరారు.. సర్టిఫికెట్ల ఆమోదం.. క్రీడల్లో పాల్గొన్నా గుర్తించకపోవడం.. స్పాన్సర్‌షిప్‌ తదితర విషయాల్లో ఎన్‌సీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి మా జీవితాలతో ఆడుకున్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి’’అని కోరుతూ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, వైఎస్సార్‌ కడప, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. అభ్యర్థుల పట్ల ఎన్‌సీసీ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ విశ్వసనీయతను తాము శంకించడం లేదని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్‌సీసీ అధికారులు పరస్పర విరుద్ధ వైఖరి గమనిస్తే, వైద్య విద్య ఎన్‌సీసీ కోటా సీట్ల భర్తీలో అంతా సవ్యంగానే జరిగిందని అనిపించడం లేదని ఆంది. 

అవకతవకలను గుర్తించడమే పరిష్కారం 
‘‘కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఆ సమయం ఇంకా రాలేదని మేం భావిస్తున్నాం. పిటిషనర్లు కోరుతున్నట్లు వారికి ప్రవేశాలు కల్పిస్తే ఇప్పటికే ఎన్‌సీసీ కోటా కింద ప్రవేశాలు పొందిన వారిని బయటకు పంపాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ పిటిషనర్లకు ప్రవేశం కల్పించి వారి సీట్లలో ఉన్న వారిని బయటకు పంపితే దానిపై అభ్యంతరం తెలియచేసేందుకు వారికి పూర్తి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు వారు కోరుతున్న విధంగా ప్రవేశాలు కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అవకతవకలను గుర్తించడమే ఈ సమస్యకు పరిష్కారం.

అందువల్ల ఎన్‌సీసీ కోటా కింద జరిగిన సీట్ల భర్తీపై విచారణకు ఆదేశిస్తున్నాం. విచారణాధికారిగా బ్రిగేడియర్‌ రోవిన్‌ పేరుకు ఆమోదం తెలుపుతున్నాం. ఎన్‌సీసీ కోటా కింద ఉన్న క్రీడలు, వ్యక్తిగత, బృంద క్రీడలు, ఎన్‌సీసీ స్పాన్సర్‌ చేసిన, గుర్తించిన క్రీడల వివరాలు, ఇప్పటికే ఈ కోటా కింద ప్రవేశాలు పొందిన వారి వివరాలు, వారు శిక్షణకు వెళ్లింది నిజమా? కాదా? వారు పొందిన సర్టిఫికేట్లు నిజమైనవేనా? కావా? అన్న విషయాలను తేల్చాలి’’అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top