విత్తనోత్పత్తిలో సహాయం చేయండి

Help in the seeds devolopment - Sakshi

తెలంగాణను కోరిన వియత్నాం ప్రతినిధుల బృందం  

సాక్షి, హైదరాబాద్‌: నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన నిల్వలో సాంకేతిక పరిజ్ఞానంపై సహకారం అందించాలని వియత్నాం దేశ జాతీయ అసెంబ్లీ ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని కోరింది. 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌ చేరుకున్న వియత్నాం ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమైంది. వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమలు, వ్యాపారం, విత్తన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవటానికి తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు 10 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న గుయెన్‌ తి యెన్‌ తెలిపారు. తమ దేశంలో గాలిలో అధిక తేమ వల్ల విత్తన నిల్వ సమస్యగా ఉందన్నారు. విత్తన పంటల కోత అనంతరం విత్తన నాణ్యతా పరిరక్షణ, విత్తన నిల్వలపై శిక్షణ అందించాలని కోరారు.

భారతదేశానికి తెలంగాణ విత్తన రాజధానిగా ఉండటం గర్వకారణమన్నారు. ప్రస్తుతం తాము విత్తనాన్ని అమెరికా, ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని తెలుసుకొని ఒప్పందాలు చేసుకోవటానికి రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, రష్యా, ఇటలీ తదితర 20 దేశాలకుపైగా విత్తనాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. వియత్నాం సహా ప్రపంచ దేశాలకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

వియత్నాంకు అన్ని విధాలా శాస్త్ర, సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే 32వ ఇస్టా సదస్సుకు రావాలని వియత్నాం బృందాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులు, సుదర్శన్, రవీందర్‌ రెడ్డి, భాస్కర్‌ సింగ్, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top