ఎస్సారెస్పీ వద్ద భారీగా బలగాలు

Heavy troops at srsc - Sakshi

సాగునీరు కోసం ఐదారు రోజులుగా రైతుల ఆందోళన  

ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని మంత్రి హరీశ్‌ ప్రకటన

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితులు లేవని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో తేల్చి చెప్పడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఐదారు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఉన్నతస్థాయి సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారని, శనివారం వరకు ఓపిక పట్టాలని అధికారులు రైతులను సముదాయిస్తూ వచ్చారు. దీంతో వారు తాత్కాలికంగా ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

అయితే, ప్రాజెక్టు నుంచి నీరు విడుదల సాధ్యం కాదని మంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ప్రారంభానికి ముందు నుంచే ఎస్సారెస్పీలో పోలీసులు బలగాలను పెంచారు. నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల కమిషనర్లు, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల ఎస్పీలు ఉదయమే ఎస్సారెస్పీకి చేరుకున్నారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు పోలీసు బలగాలను బృందాలుగా పంపించారు.

సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. పోలీసుల మోహరింపుతో గ్రామాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా నిఘా పెంచారు. ఎస్సారెస్పీ డ్యాంపై కంచె ఏర్పాటు చేసి బందోబస్తును పెంచారు.  నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాలు చేపడుతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఆదివారం ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే గ్రామాల్లోనే నిరసన తెలుపుతామని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top