ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు | Heavy Rains Adilabad District | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు

Aug 4 2019 6:52 PM | Updated on Aug 4 2019 7:18 PM

Heavy Rains Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా బోథ్‌ నియోజకవర్గంలో శనివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేరేదిగొండ మండలం కుప్తి దగ్గర కడెం వాగుకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ సమయంలో వాగు సమీపంలోని వెంకటాపూర్‌ దగ్గర పశువులు కాస్తున్న అకోశ్‌ అనే కాపరి వరదనీటిలో చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. స్థానిక పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు అశోక్‌ను...తాడు సాయంతో బయటకు తెచ్చారు. మరోవైపు భారీ వర్షాల వల్ల కుంటాల, పొచ్చేర జలపాతలకు వరద ఉధృతి పెరిగింది. నిర్మల్‌ జిల్లా బైంసా మండలంలోని సుంక్లీ పెంచికల్‌పాడ్‌ మార్గమధ్యలోని గణపతి వాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులో పశువుల కాపరి చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు... అతన్ని సురక్షితంగా బటయకు తీసుకొచ్చారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులో వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో పలు ఇళ్లు కుప్పకులాయి.  అయితే ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.  కాగా ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం కావడంతో ఆయా కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉండటానికి నిలువనీడ లేదని.. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రాజెక్టులకు జలకళ
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 65 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 5.21లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాళేశ్వరం పుష్కరఘాట్‌ దగ్గర 9.42 మీటర్ల మేర గోదావరి ప్రవాహం కనిపిస్తోంది. అన్నారం బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో 28వేల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తుండంతో జూరాల వద్ద 23 గేట్లు ఎత్తివేశారు. 2లక్షల 39 వేల 293 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ, దిగువన ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా వరద పెరిగిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 25వేల క్యూసెక్కులుగా ఉండగా... ఔట్‌ఫ్లో 568 క్యూసెక్యులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 20.175టీఎంసీలుకాగా... ప్రస్తుతం 17టీఎంసీలకు చేరింది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌ కూడా నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇన్‌ఫ్లో 12వేల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 252 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement