వదల బొమ్మాళీ.. | Have had an impact on the spread of many types of lung diseases | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ..

Jun 17 2014 2:58 AM | Updated on Jun 4 2019 5:04 PM

వదల బొమ్మాళీ.. - Sakshi

వదల బొమ్మాళీ..

పాలిథిన్ కవర్ల వినియోగం ప్రజారోగ్యానికి పెను భూతంలా పరిణమించింది. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఎటు చూసినా కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో సింహభాగం పాలిథిన్ కవర్లే దర్శనమిస్తున్నాయి.

బాన్సువాడ :  పాలిథిన్ కవర్ల వినియోగం ప్రజారోగ్యానికి పెను భూతంలా పరిణమించింది. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఎటు చూసినా కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో సింహభాగం పాలిథిన్ కవర్లే దర్శనమిస్తున్నాయి. పాలిథిన్ కవర్లను నిషేధిస్తూ రెండేళ్ళ క్రితం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
 
జిల్లాలో అధికారులు పాలిథిన్ కవర్ల గురించి ఆలోచించడమే మానేశారు. భూమిలో ఏ మాత్రం కరిగే అవకాశం లేని వీటి వల్ల వర్షపు నీరు లోతుల్లోకి ఇంకకపోవడమే కాకుండా, వాటిని తిన్న పశువులను తీవ్ర అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. పాలిథిన్ కవర్లను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు మనుషుల ఆరోగ్యానికి తీరని ముప్పు చేస్తున్నాయి. పాలకులు, అధికారుల చిత్తశుద్ధి లోపంతో గతంలో విధించిన నిషేధాజ్ఞలు నీరుగారిపోయాయి.
 
జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలతో పాటు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద తదితర గ్రామ పంచాయతీలు పాలిథిన్ కవర్ల నిషేధం అమలుకు చర్యలు తీసుకున్నారు.  వీటిలో కొన్ని నిషేధాన్ని కడదాకా కొనసాగించడంలో విఫలం కాగా కొన్ని గ్రామాల్లో ఆపసోపాలు పడుతూ అమలు చేస్తున్నాయి. బాన్సువాడలో గతేడాది పాలిథిన్ కవర్లు వాడిన వారికి భారీ జరిమానాలు విధిస్తామని ప్రకటించడమే కాకుండా,  నెల రోజుల పాటు అమలు చేశారు. అయితే సరైన ప్రత్యామ్నాయాలు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు.
 
పాలిథిన్ కవర్లకు బదులుగా చౌకగా లభించే ఇతర కవర్లు వేటినీ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో క్రమేణా నిషేధం అమలు నీరుగారిపోయింది. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ ఇప్పుడు చెత్తకుప్పల్లో పాలిథిన్ కవర్లే దర్శనమిస్తున్నాయి. ఎటుచూస్తే అటు దుకాణాలన్నింటా ఈ కవర్లే వినియోగంలో ఉన్నాయి. ఇళ్ళ నుంచి ఎటువంటి సంచులు తీసుకోకుండా బజార్లకు వచ్చేసి కావాల్సిన సరుకులను వివిధ రకాలైన పాలిథిన్ కవర్లలో మోసుకొని వెళ్తున్నారు. ఇలా వాడేసిన కవర్లను ఇళ్ల ముందు చెత్తకుప్పల్లో కాలువల్లో పడేస్తున్నారు.
 
 గ్రామ పంచాయతీలు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని నిషేధించకపోగా, పారిశుధ్య సిబ్బంది కొరత నెపంతో చెత్తకుప్పలు తొలగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో వారాల తరబడి పేరుకుపోతున్న చెత్తకుప్పల వల్ల దుర్గంధం వ్యాపించడమే కాకుండా, అందులోని పాలిథిన్ కవర్లను పశువులు ఆహారంగా తీసుకొని జబ్బులకు గురవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో పాలిథిన్ కవర్లు ఉన్న చెత్తకుప్పలను తగులబెట్టడం వ్లల వీటి నుంచి వెలువడే పొగలు ప్రజారోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికైనా పాలిథిన్ కవర్ల నిషేధం అమలు గురించి అధికారులు చర్యలు తీసుకొని, వాటి స్థానంలో ఈ కవర్లకు సరిసమానమైన చౌక ధరలతో కూడిన క్యారీ బ్యాగులు మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి  చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
 అనర్థాలు ఇవీ


పాలిథిన్ కవర్లు, వేల లక్షల సంవత్సరాలు కరిగిపోకుండా అలాగే భూమి పొరల్లో పేరుకుపోతాయి.
ఇవి అడ్డుపడడం వల్ల భూమిలోకి నీరు ఇంకడం ఆగిపోయి భూగర్భ జల మట్టాలు తగ్గిపోతాయి.
సారవంతమైన వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతాయి.
చెత్తకుప్పల్లోని పాలిథిన్ కవర్లను పశువులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఉదరకోశ, శ్వాస సంబంధ వ్యాధులతో మరణిస్తాయి.
పాలిథిన్ కవర్లను చెత్తకుప్పల తో పాటు కాల్చడం వల్ల వెలువడే విషవాయువులు, మానవుల ఊపిరితిత్తులపై ప్రభావం చూపి అనేక రకాల రోగాలు వ్యాపిస్తాయి.
* ఎక్కడపడితే అక్కడ ఆ పాలిథిన్ కవర్లు పారేయడం వల్ల అవి అడ్డుపడి మురుగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement