పసి హృదయానికి పునర్జన్మ | Harrisrao Financial Assistance | Sakshi
Sakshi News home page

పసి హృదయానికి పునర్జన్మ

Feb 19 2018 2:20 AM | Updated on Oct 2 2018 5:51 PM

Harrisrao Financial Assistance - Sakshi

సిద్దిపేటజోన్‌/సిద్దిపేట రూరల్‌: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్థికసాయం అందించడంతో తమ బిడ్డ ప్రాణాలు దక్కాయని ఓ బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌ను ఈ సందర్భంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాలు. సిద్దిపేట మండలం వెల్కటూర్‌కు చెందిన పుట్ట ఉమ, సతీశ్‌ దంపతులకు గత నెలలో మగ శిశువు జన్మించాడు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి ఉండటంతో హైదరాబాద్‌ స్టార్‌ ఆసుపత్రిని ఆశ్రయించారు.

పసికందును పరీక్షించిన వైద్యులు.. ఆపరేషన్‌ అవసరమని, రూ.6 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పారు. పొట్టకూటికి హైదరాబాద్‌లోని ఓ చిన్న కంపెనీలో పనిచేస్తున్న సతీశ్‌కు అంత స్తోమత లేదు. విషయం మంత్రి హరీశ్‌రావు దృష్టికి రావడంతో.. వెంటనే దంపతులను పిలిపించి భరోసానిచ్చారు. అటు డాక్టర్లతో మాట్లాడటంతో పాటు రూ.6 లక్షలు అందచేశారు. దీంతో గతనెల 23న బాబుకు ఆపరేషన్‌ చేయగా, విజయవంతమైంది.

ఆదివారం సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రిని సతీశ్‌ దంపతులు పసికందుతో వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలపగా, హరీశ్‌రావు బాబును చేతుల్లోకి తీసుకుని యోగక్షేమాలు అడిగారు. బాబుకు పునర్జన్మ ఇచ్చిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పసికందు తల్లిదండ్రులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement