నమ్మి నారు పోస్తే.. నీరు లేదంటారా?: హరీశ్‌ | Harish Rao at a media conference held at Telangana Bhavan on Tuesday | Sakshi
Sakshi News home page

నమ్మి నారు పోస్తే.. నీరు లేదంటారా?: హరీశ్‌

Jul 22 2026 3:49 AM | Updated on Jul 22 2026 3:49 AM

Harish Rao at a media conference held at Telangana Bhavan on Tuesday

దేవాదుల ద్వారా నీళ్లు ఎత్తకపోవడం కాంగ్రెస్‌ సృష్టించిన కరువే 

22 రిజర్వాయర్లు నింపుతామనే హామీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు 

దేవాదుల మోటార్లు నడపకుంటే రైతులతో కలిసి ప్రజా పోరాటం 

సాక్షి, హైదరాబాద్‌: దేవాదుల ఎత్తిపోతల పథ కం ద్వారా 22 రిజర్వాయర్లలో 38 టీఎంసీల నీరు నింపుతామని ప్రభుత్వ ప్రకటనను నమ్మి న నారు పోసిన రైతులకు నాట్ల సమయంలో నీరు లేదని చెప్పడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీలు, గోదావరిలో 22వేల క్యూసెక్కుల వరద ఉన్నా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘నీటిని ఒడిసి పట్టకుండా చంద్రబాబు కోసం ఏపీకి నీళ్లు వదిలి పెట్టడమే ప్రభుత్వ విధానమా? ఇది ఎల్‌నినో తెచి్చన కరువు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరంగల్‌ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారు. 3.17లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా దేవాదుల పథకాన్ని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్‌డీఎస్‌ఏ పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దేవాదుల పథకంలో ఎందుకు నీటిని లిఫ్ట్‌ చేయడం లేదు. 

రామప్ప చెరువు తూములను మూసి వేయించిన మంత్రులు రైతులకు క్షమాపణ చెప్పాలి. సమ్మక్క బరాజ్‌ నుంచి దిగువకు 105 టీఎంసీలు నీళ్లు వెళ్తే అందులో దేవాదుల ద్వారా ఎత్తిపోసింది కేవలం 1.9 టీఎంసీలు మాత్రమే. రోజుకు పావు టీఎంసీ చొప్పున లిఫ్ట్‌ చేసే అవకాశమున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తప్పడు నిర్ణయాలతో రైతులకు నష్టం జరుగుతోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

డైలీ సీరియల్‌ తరహాలో 
ఉత్తమ్‌ ప్రకటనలు: ‘జనగామ, హను మకొండ, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయ ని వాతావరణ శాఖ చెప్తున్నా దేవాదుల పూర్తి చేస్తామంటూ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డైలీ సీరియల్‌ తరహాలో డైలాగులు చెబుతున్నారు. 30 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు మినహా సీఎం రేవంత్, ఉత్తమ్‌ చేసిందేమీ లేదు. సీఎం రేవంత్‌కు దేవాదుల ఎక్కడుందో తెలియదు, నదీ పరీవాహక ప్రాంతాల గురించి కూడా అవగాహన లేదు. రేవంత్‌ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లను ఆన్‌ చేయాలి. 

దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు రూ.800 కోట్ల మేర పంటను నష్టపోయే అవకాశముంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని ఆదుకోకుంటే రైతులతో కలిసి ప్రజా పోరాటాలు చేస్తాం’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement