గీత దాటితే.. మొక్క నాటాల్సిందే!

Haritha Haram In MAHABUBNAGAR - Sakshi

వనపర్తి క్రైం : ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించిన ప్రతిఒక్కరి చేత మొక్కలు నాటించి, హరితహారంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు సోమవారం వనపర్తి జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో హరితహరం కార్యక్రమం చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో పాత నేరస్తులు, డ్రంకెన్‌ డ్రైవ్, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించిన వారిని హరితహారంలో భాగస్వాములు చేస్తూ మొక్కలు నాటడంపై పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అంతరించిపోతున్న అడవులను పెంచాలనే ఉద్దేశంతో హరితహరం కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లా పోలీస్‌శాఖ తనవంతు సామాజిక బాధ్యతగా చెట్లు నాటే కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభించింది. 

సంస్కరణల పాలసీ.. 

పోలీస్‌ విభాగం యొక్క ‘సంస్కరణల పాలసీ‘లో భాగంగా నేర చరిత గల వారిలో సత్ప్రవర్తనతో మార్పు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వారిని పోలీస్‌స్టేషన్లకు రప్పించి, వారిచేత మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబోతుంది. ఇక మీదట వారు నేరం చేయకుండా ఉండటానికి ఈ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇస్తుందని పోలీస్‌ శాఖ భావిస్తుంది.

నేరస్తుల చేత మొక్కలు నాటించడం వల్ల వారిలో ఎంతమార్పు వచ్చిందని పోలీస్‌శాఖ గుర్తిస్తుంది. అయితే ప్రధానంగా  నేర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తూ సానుకూలమైన పున:ప్రారంభ కార్యక్రమాలు సమాజానికి సహాయపడుతాయని జిల్లా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

కమ్యూనిటీ ఔట్‌రీచ్‌ ప్రోగ్రాం 

జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లు, పోలీస్‌ నివా స గృహాలు, సీఐ, ఇతర పోలీస్‌ కార్యాలయాల్లో కలిపి కొన్ని లక్షల మొక్కల పెంపకం చేపట్టాలని జిల్లా పోలీస్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ‘కమ్యూనిటీ ఔట్‌రీచ్‌ ప్రోగ్రాం ద్వారా పౌరులని భాగస్వాములు చేస్తూ విస్తృత సామాజి క సమస్యలు, నేరాలకు దారితీసే మావన అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, మద్యపానం వంటి అవగాహన కార్యక్రమాలు హ రితహారంలో ఒక భాగంగా నిర్వహించాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్న వారిని, రౌడీషీటర్, అనుమానితులను హరి తహారంలో భాగస్వాములను చేస్తూ జిల్లా వ్యాప్తం గా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

అన్ని పోలీస్‌స్టేషన్లలో మొక్కలు 

వనపర్తి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో విడలవారీగా నేరస్తుల చేత మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. ఎవరైనా ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించినట్లయితే వారి ఫొటో  తీసి 9705320420 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపినట్లయితే వారిని హరితహారంలో భాగస్వాములను చేయాలని భావిస్తుంది. రెండో సారి ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top