మనది ప్రపంచంలో రెండో ప్రమాదకర దేశం
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 2 లక్షల మందికిపైగా మృత్యువాత
ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 18 శాతం మన దేశంలోనే
హైవేల విస్తీర్ణం పెరిగినా సురక్షిత ప్రయాణాలు లేవు
రాష్ట్రంలో భయానక ప్రమాదాలు
2024–25లోనే 10,522 మంది మృతి
ఓవర్ స్పీడ్, డ్రంక్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకపోవడం ప్రధాన కారణాలు
సాక్షి, అమరావతి: మన దేశంలోని రహదారులపై భద్రతకు ప్రమాదం వాటిల్లింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద రహదారి నెట్‌వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం రెండుశాతం రోడ్లు మాత్రమే జాతీయ రహదారులు కాగా.. వాటిపైనే 35 నుంచి 40 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను బట్టి చూస్తే ప్రపంచంలోని 199 దేశాల్లో మన దేశం రెండోస్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
ఏటా మన దేశంలో 2.06 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో ఇది 18 శాతం. దీనివల్ల సామాజిక, ఆర్థికరంగాల్లో జరిగిన నష్టం రూ.1.47 లక్షల కోట్లని అంచనా. దేశ జీడీపీలో ఇది ఒక శాతానికి సమానం. రోడ్డు ప్రమాద మరణాలు చైనాలో అత్యధికంగా ఏడాదికి 2.48 లక్షలు ఉండగా ఆ తర్వాత స్థానంలో మన దేశం ఉంది.
అమెరికాలో 48 లక్షల మంది, బ్రెజిల్‌లో 34 లక్షలు, బంగ్లాదేశ్‌లో 32 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న మరణాలకు గల కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఎనిమిదో కారణంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది.
ఆంధ్రాలో భయానక ప్రమాదాలు
మన రాష్ట్రంలోనూ రోడ్డు ప్రమాదాలు భయానకంగా ఉన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో కొద్దిరోజుల కిందట ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృతిచెందారు. గత ఆరేళ్లలో మన రాష్ట్రంలో లక్షకుపైగా ప్రమాదాలు జరిగాయి.
వాటిలో 45 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ 21, 22 స్థానాల్లో ఉన్నాయి. 2024–25లో ఈ ప్రమాదాలు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
2024–25లో 24,511 ప్రమాదాలు జరగ్గా వాటిలో 10,522 మంది మరణించారు. జాతీయ రహదారులపై ఇష్టానుసారం పార్కింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెనుక నుంచి ఢీకొనడం వల్ల జరిగే ప్రమాదాలు మన రాష్ట్రంలో అత్యధికం. మానవలోపాలు, కండిషన్‌లో లేని వాహనాలు ఈ ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు
ఓవర్‌స్పీడ్ : 70 శాతానిపైగా రోడ్డు ప్రమాదాలు ఈ కారణంతోనే జరుగుతున్నాయి
» డ్రైవర్లు రూల్స్ పాటించకపోవడం, డ్రైవింగ్ నైపుణ్యాలు లేకపోవడం
» మద్యం తాగి వాహనాలు నడపడం
» రాంగ్ సైడ్ డ్రైవింగ్, హైవేలపై వాహనాలు నిలపడం
» మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం
» వాహనాల సమస్యలు: ఓవర్‌లోడింగ్, కండిషన్‌లో లేని వాహనాల వినియోగం
» సేఫ్టీ డివైసెస్ లేకపోవడం: హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం
» రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, రోడ్ సేఫ్టీ ఆడిట్ చేయకపోవడం
» మిక్స్‌డ్ ట్రాఫిక్: పెద్ద వాహనాలు, కార్లు, బైకులు, పాదచారులకు ఒకటే మార్గం కావడం
» సరైన లేన్ మార్కింగ్ లేకపోవడం, మార్కింగ్ ఉన్నా లేన్ డిసిప్లిన్ పాటించకపోవడం
» ట్రాఫిక్ నియమాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం
ఇండియా రోడ్ నెట్‌వర్క్
» మొత్తం రోడ్ల నిడివి 68 లక్షల కిలోమీటర్లు
» జాతీయ రహదారులు: 1.45 లక్షల కిలోమీటర్లు
» రాష్ట్ర రహదారులు: 1.8 లక్షల కిలోమీటర్లు
» ఎక్స్‌ప్రెస్ వేస్: 3 వేల కిలోమీటర్లు
» ట్రాఫిక్ లోడ్: ప్రపంచ రహదారుల మొత్తం పొడవులో 2 శాతం మాత్రమే మన దేశంలో ఉంది. కానీ రహదారి ట్రాఫిక్‌లో పదిశాతం కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటోంది.
దేశంలో అత్యంత ప్రమాదకర జాతీయ రహదారులు
1 ఎన్‌హెచ్–44 (శ్రీనగర్–కన్యాకుమారి)
2 ఎన్‌హెచ్–48 (ఢిల్లీ–చెన్నై)
3 ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా)
4 ఎన్‌హెచ్–66 (ముంబై–కేరళ తీర రహదారి)
5 ఎన్‌హెచ్–19 (ఢిల్లీ–కోల్‌కతా, పాత గ్రాండ్‌ట్రంక్ రోడ్)
6 ఎన్‌హెచ్–65 (హైదరాబాద్–పుణె–ముంబై)
రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర జాతీయ రహదారులు
1 ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా తీర రహదారి): రాష్ట్రంలో ప్రమాదాల హాట్‌స్పాట్‌లలో నంబర్‌వన్. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువ. అధిక వేగం, లారీ ట్రాఫిక్, రాత్రివేళ లైట్ సమస్యలు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
2 ఎన్‌హెచ్–44 (హైదరాబాద్–కర్నూలు–తిరుపతి): కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోంచి వెళ్లే ఈ పొడవైన రహదారిపై వేగం నియంత్రణ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
3 ఎన్‌హెచ్–71 (తిరుపతి–నెల్లూరు): తిరుపతి–రేణిగుంట–నెల్లూరు మార్గంలో హెవీ ట్రాఫిక్, పొడవైన స్ట్రెయిట్ రోడ్ కావడం వల్ల వేగంపై నియంత్రణ ఉండడం లేదు.
4 ఎన్‌హెచ్–65 (హైదరాబాద్–విజయవాడ): వాణిజ్య వాహనాల రద్దీ, చిన్న వాహనాల వేగం కలిపి ఈ మార్గాన్ని ప్రమాదకరంగా మార్చాయి.
5 ఎన్‌హెచ్–216 (మచిలీపట్నం–కాకినాడ–ఒంగోలు): వర్షాకాలంలో గుంతలతో నిండిపోతుంది. రాత్రివేళ లైట్ లేకపోవడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి
అత్యంత ప్రమాదకర రాష్ట్ర రహదారులు
1 తిరుపతి–కడప: తిరుపతి, కడప మధ్య పర్వత మార్గాలు, వంకరల రోడ్డు. మలుపుల్లో నియంత్రణ కోల్పోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి.
2 గుంటూరు–మాచర్ల–నాగార్జునసాగర్: కొండప్రాంతాలు, మలుపులు ఎక్కువ. ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు కలిసి నడవడం వల్ల ప్రమాదాలు అధికం.
3 విజయనగరం–సాలూరు–అరకు: కొండ ప్రాంతం, పచ్చని దట్టమైన అడవుల మధ్య రహదారి.
4 ఒంగోలు–కందుకూరు–కావలి: తీరప్రాంతం కావడం వల్ల వర్షాకాలంలో రోడ్లు దెబ్బతింటున్నాయి. లారీలు, బస్సులు వేగంగా నడవడం ప్రమాదాలకు కారణం.


