హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. 'మీరేం పరిశీలించారు' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజనుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి.. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గ్యాప్ నుంచి మరోవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన టెంపో అతడిని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు తన స్కూటర్‌తో సహా రోడ్డుపై పడిపోయాడు.
టెంపో వెనుకే వచ్చిన మరో స్కూటరిస్ట్ కూడా కిందపడబోయి తమాయించుకున్నాడు. ద్విచక్రవాహనదారులు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోనే సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేసి.. 'మీరేం పరిశీలించార'ని అడిగారు. బాధ్యతతో కూడిన డ్రైవిండ్, ఎల్లప్పుడు భద్రతే ముఖ్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడండి అంటూ హ్యాష్‌ట్యాగ్స్ జత చేశారు. అయితే ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని (Hyderabad) ఏ ప్రాంతంలో జరిగిందన్న వివరాలు వెల్లడించలేదు.
ఈ వీడియోపై నెటిజనులు (Netizens) స్పందించారు. ఈ ప్రమాదంలో రెండు వైపులా తప్పు ఉందని అభిప్రాయపడ్డారు. స్కూటరిస్ట్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయగా, టెంపో డ్రైవర్ నియంత్రించలేని వేగంతో ప్రమాదానికి కారణమయ్యాడని పేర్కొన్నారు. స్కూటరిస్ట్, టెంపో డ్రైవర్.. ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
''ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ చూస్తుంటాం. పోలీసులు కూడా వారిని చూస్తారు, కానీ పట్టించుకోర''ని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన ఖాళీలు లేకుండా చూడాలని, డివైడర్ల సైజు పెంచాలని మరొకరు సూచించారు. షార్ట్‌కట్‌లతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని పలువురు హితవు పలికారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) కచ్చితంగా పాటించాలన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ శాఖ సహాయంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు.. సెమినార్లు, వీడియో సెషన్‌లు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. బాధ్యతారహిత డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టి బోధించాలని ఓ నెటిజన్ సూచించారు.
చదవండి: గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
ద్విచక్ర వాహనదారులే ఎక్కువ..
మన దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,51,228 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా (45.80 %) ఉన్నారని నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు (61.4 %) జరుగుతున్నట్టు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.
What are your observations? #DriveWithResponsibility#SafetyFirstAlways#ResponsibleDriving#FollowRulesSaveLives pic.twitter.com/5z2RZO8BbN
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 30, 2025


