
హరీశ్ ఏడీ .. ఎక్కడ ?
టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు,
ప్లీనరీ వేదికపై వెనుక వరుసలో కూర్చున్న హరీశ్‌రావు
సభలో ముందు వరుసలో లేకపోవడంపై గుసగుసలు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈ ప్లీనరీ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో ఎందులోనూ ఆయన లేరు. ఈ విషయం పార్టీలో ఇప్పటికే చర్చనీయాంశంకాగా, శుక్రవారం నాటి ప్లీనరీ వేదికపై హరీశ్ కనిపించక పోవడం స్టేడియంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్లీనరీ ఆరంభంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత అమరవీరులకు నివాళి అర్పించిన సమయంలోనూ ఆయన వేదికపై కనిపించక పోవడంతో అసలు ప్లీనరీకి హాజరయ్యారా..? లేదా అంటూ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. హరీశ్ ఏడీ..? ఎక్కడా అంటూ మీడియా ప్రతినిధులూ ఒకరినొకరు వాకబు చేసుకున్నారు. చివరకు ఆయన వేదికపైనే, వెనుక వరుసలో ఉన్నారన్న సమాచారం అందడంతో, ముందు వరుసలో ఉండాల్సిన ఆయన వెనుకకు ఎందుకు వెళ్లారన్న చర్చా జరిగింది.
ఆలస్యంగా వేదికపైకి..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డిలతో కలసి మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునే ముందే తుమ్మల, మహేందర్‌రెడ్డి వచ్చారు. అయితే సీఎం వెంట కూడా హరీశ్‌రావు కనిపించకపోవడం ప్రాంగణంలో గుసగుసలకు దారితీసింది. అయితే ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోగానే ఆయన, ప్రతినిధులను కలిసేందుకు ఆయా బ్లాకుల వద్దకు వెళ్లినట్లు కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తలను కలుస్తూ తిరిగిన ఆయన ఆలస్యంగానే వేదిక మీదకు వచ్చారు. అయితే, వెనుక వరుసకే పరిమితం కావడం.. టీవీ లైవ్‌లలోనూ ఆయన ఎవరికీ కనిపించకపోవడంతో, అసలు హాజరు కాలేదేమోనన్న ప్రచారం జరిగింది.
హరీశ్‌కు మద్దతుగా ప్రతినిధుల కేకలు
సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ అంశాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు హరీశ్‌రావు మైక్ ముందుకు రాగానే, ప్రతినిధుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సుమారు మూడు.. నాలుగు నిమిషాల సేపు కేకలతో ఉత్సాహం ప్రకటించారు. హరీశ్ ప్రసంగం మొదలు పెట్టినా, కేకలు ఆపలేదు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మధ్యలో నినాదం చేసి హరీశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కార్యకర్తల నుంచి కేకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో సభా వేదికపై ఉన్న నేతలంతా కార్యకర్తల వైపు, హరీశ్ వైపు చూస్తూ ఉండిపోయారు.
ఏం .. జరిగింది?: టీఆర్‌ఎస్ ప్లీనరీ తేదీ ఖరారు అయ్యాక, వేసిన ఏడు కమిటీల్లోనూ హరీశ్‌కు స్థానం లేనప్పటి నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో కొంత అంతరం ఏర్పడిందని, ఇద్దరి మధ్యా పొసగడం లేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఒక విధంగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే బలమైన అభిప్రాయం కూడా ఉంది. ప్లీనరీ బాధ్యతల నుంచి హరీశ్‌రావును అందుకే దూరం పెట్టారని కొందరు పేర్కొనగా, మిషన్ కాకతీయ పనుల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నందునే ప్లీనరీ బాధ్యతలు ఇవ్వలేదని పార్టీలోని మరి కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొద్ది రోజులుగా హరీశ్‌రావు కొంత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో ఈ రకంగా ఆయన తన అంసతృప్తిని వ్యక్తం చే సి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.