breaking news
TRS 2015 plenary
-
సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం
టీఆర్ఎస్ ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలను నేతలు ప్రవేశపెట్టగా వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో దాదాపు 12 అంశాలు దాదాపుగా టీఆర్ఎస్ హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించినవే ఉండగా.. ఒక్క అంశం మాత్రం పార్టీ నియమావళికి సంబంధించినది. వివిధ అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలు ఇలా ఉన్నాయి.. - సాక్షి, హైదరాబాద్ కార్యకర్తలకు ప్రాధాన్యమిద్దాం ప్రవేశపెట్టింది: పెద్ది సుదర్శన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు.. దీన్ని దేవీప్రసాద్ బలపర్చారు. పద్నాలుగేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కేసీఆర్‌పై విశ్వాసంతో కార్యకర్తలు పార్టీని కాపాడుతూ వచ్చారు. కానీ ప్రజాప్రతినిధులు వారికి ప్రాధాన్యమివ్వట్లేదు. దీనిపై ప్రజాప్రతినిధులకు అధినేత తగు సూచనలివ్వాలి. కార్యకర్తల స్థాయి, అర్హత, సామాజిక కోణాన్నిబట్టి నామినేటెడ్ పోస్టులివ్వాలి. ప్రభుత్వ పథకాల ప్రచారానికి వారి సేవలను వినియోగించుకోవాలి. ఇందుకు వారికి నిత్యం శిక్షణా తరగతులు నిర్వహించాలి. టీఆర్ఎస్ను దేశంలోనే అత్యంత పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీగా తీర్చిదిద్దాలి. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రవేశపెట్టింది: బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ, వరంగల్.. ఎంఏ బేగ్ దీనిని బలపర్చారు. న్యూయార్క్, లండన్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని, ఇతర పట్టణాల్లో రింగ్‌రోడ్లు, అంతర్గత రోడ్లు, మార్కెట్లు, శ్మశానాలు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘మునిసిపాలిటీలు మురికి కూపాలయ్యాయి. హైదరాబాద్‌లో కూరగాయల మార్కెట్లు, ధోబీ ఘాట్లు, రోడ్లు, డ్రైనేజీలు, బస్టాండ్లు వికృతంగా తయారయ్యాయి. హుస్సే న్ సాగర్‌ను శుద్ధి చేసి తీరుతాం’ అని ప్రకటించారు. తెలంగాణ ప్రజా సంక్షేమం ప్రవేశపెట్టింది: కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు కదులుతున్నాం. సంక్షేమ హాస్టళ్లలో గతంలో ముక్కిపోయిన అన్నం, పాడైన సాంబారు వడ్డించేవారు. సన్నబియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లలో పెడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టేందుకు అధినేత కృషి చేయాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలి. దళితులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ పథకం అమలును వేగవంతం చేయాలి. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం ప్రవేశపెట్టింది: నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై దాడి జరిగింది. తెలంగాణ పోరాట యోధుల నెత్తురు చవిచూసిన ఆంధ్రా నాయకుల విగ్రహాలు, ఆనవాళ్లూ ఇంకా ఇక్కడ ఉండటం సమంజసం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు, ఉద్యానవనాలకు, వీధులకు, యూనివర్శిటీలకు తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టాలి. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలి. ప్రతి జిల్లా కేంద్రంలో బహుళార్ధక సాంస్కృతిక కేంద్రాలను నిర్మించాలి. తెలంగాణ సాహి త్య ముద్రణకు, ఉద్యమ చరిత్రను రికార్డు చేసే చర్యలు చేపట్టాలి. వ్యవసాయం- మిషన్ కాకతీయ ప్రతిపాదించింది: టి.హరీశ్‌రావు, సాగునీటిశాఖ మంత్రి నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిన తెలంగాణ పోరాటాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు నీళ్లను ఒడిసిపట్టుకునే కార్యక్రమానికి పూనుకున్నాం. చుట్టూ గోదావరి, కృష్ణా నదులున్నా చుక్కనీరు వాడుకోలేని పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూనే, కొత్తగా పాలమూరు ఎత్తిపోతల తెస్తున్నాం. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయను ప్రజా కార్యక్రమంగా మలిచాం. మిషన్ కాకతీయ పనులు పారదర్శకంగా జరిగేలా, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణ విద్యుత్ రంగం ప్రవేశపెట్టింది: విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి రాష్ట్రం విడిపోతే తెలంగాణలో విద్యుత్ ఉండదన్న నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినా సీఎం కేసీఆర్ కేవలం ఏడాదిలోనే ఈ సమస్యను అధిగమించారు. నేదునూరు, శంకరపల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులు జరపాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రం 4,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వుండగా.. 2018 నాటికి 20,633 ఎంవీలకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త థర్మల్ ప్లాంట్లను నిర్మిస్తున్నాం. జల, బొగ్గు, సౌర విద్యుత్ కలిపి 2018 నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 24,075 ఎంవీలకు పెంచుతాం. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన ప్రవేశపెట్టింది: రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ తీర్మానాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపర్చారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామానికి డబల్ రోడ్లు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు నాలుగు లైన్ల రహదారులను నిర్మిస్తాం. రాష్ట్రంలోని విమానాశ్రయాలు, డ్రై పోర్టులు, జాతీయ రహదారుల విస్తరణ తదితర పనులతో రాష్ట్ర రవాణా రంగాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం. ఇందుకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. తాగునీటి వ్యవస్థ, పారిశ్రామిక రంగం-ఐటీ ప్రవేశపెట్టింది: పంచాయతీరాజ్, మంత్రి కేటీఆర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా చేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు సాంకేతిక నివేదిక ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకంగా వుందని కేంద్రం ప్రశంసించింది. ప్రస్తుతం రాష్ట్రం రూ. 57 వేల కోట్ల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేసి ఆదాయాన్ని రూ. లక్షా 20 వేల కోట్లకు పెంచుతాం. నాలుగేళ్లలో ఇంటింటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో ఇంటర్నెట్ ఇస్తాం. వర్తమాన రాజకీయాలు- టీఆర్ఎస్ ప్రవేశపెట్టింది: ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్ర పార్టీల నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు దివాలాకోరు పార్టీలను చీల్చి చెండాడి టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతివ్వాలి. టీఆర్ఎస్ పార్టీ నేతత్వంలో ప్రజలంతా కేసీఆర్‌కు బాసటగా నిలిచి బంగారు తెలంగాణ కోసం పాటుపడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కపైసా కూడా ఇవ్వనని అసెంబ్లీలో చెప్పిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పైసాకు కూడా కొరకాకుండా పోయారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం వెనక్కి పోయిందంటూ అపవాదులు మోపాలని చూసిన కాంగ్రెస్, టీడీపీలు అభాసుపాలయ్యాయి. బీజేపీ సైతం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేదు. తెలంగాణకు హరితహారం ప్రవేపెట్టింది: సీతారాం నాయక్, లోక్‌సభ సభ్యుడు వచ్చే మూడేళ్లలో 240 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోగా 120 కోట్ల మొక్కలు నాటాలి. ఇందులో 10 కోట్ల మొక్కలు హైదరాబాద్‌లోనూ, 110 కోట్ల మొక్కలు మిగిలిని జిల్లాల్లోనూ నాటాలని నిర్ణయించింది. అధికంగా చెట్లు పెంచిన గ్రామాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి ఇవ్వనుంది. ప్రతి గ్రామంలోనూ మొక్కలను విరివిగా పెంచేలా ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలి. ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా తెలంగాణకు వానలు వాపస్ రావాలి.. కోతులు అడవులకు వాపస్ పోవాలి. కేంద్రం ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి ప్రవేశపెట్టింది: జితేందర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా హైకోర్టు విభజన, నిధుల బదిలీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, జహీరాబాద్‌లో జాతీయ విద్యా సంస్థ, రహదారుల కనెక్టివిటీ, ఎన్టీపీసీలో విద్యుత్ వాటా, కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ.. తదితర హామీలిచ్చిన కేంద్రం ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదు. 11 మందితో కూడిన ఎంపీల బృందం ఈ హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుతామని ఇచ్చిన హామీని కూడా కేంద్రం నెరవేర్చాలి. గృహ నిర్మాణం, పుష్కరాలు ప్రవేశపెట్టింది: ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం అతి త్వరలోనే బలహీన వర్గాల వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. గోదావరి పుష్కరాలకు గతంలో 27 పుష్కరఘాట్లు ఉండగా, ప్రస్తుతం 107కు పెంచాం. స్నాన ఘాట్లు, తాగునీటి సదుపాయాలు, ఇతర సౌకర్యాల కోసం రూ. 400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. గత పుష్కరాలకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు రాగా, ఈసారి 8 కోట్ల మంది రావచ్చని అంచనా. న భూతో.. న భవిష్యతి అన్నట్లుగా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల అంశం సవరణ ప్రవేశపెట్టింది: పర్యాద కృష్ణమూర్తి, సీనియర్ నేత పార్టీ నియమావళిలోని ఎన్నికల అంశంలో చిన్న సవరణ చేశాం. ఇప్పటివరకు పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో అధ్యక్షునితోపాటు కార్యవర్గ సభ్యుల ఎంపిక కూడా ఎన్నికల ద్వారానే జరిగేది. తాజా సవరణ మేరకు ఇకపై అన్ని స్థాయిల్లోనూ అధ్యక్ష పదవికే ఎన్నిక జరుగుతుంది. ఎన్నికైన అధ్యక్షునికి కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ఉంది. -
హరీశ్ ఏడీ .. ఎక్కడ ?
ప్లీనరీ వేదికపై వెనుక వరుసలో కూర్చున్న హరీశ్‌రావు సభలో ముందు వరుసలో లేకపోవడంపై గుసగుసలు హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈ ప్లీనరీ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో ఎందులోనూ ఆయన లేరు. ఈ విషయం పార్టీలో ఇప్పటికే చర్చనీయాంశంకాగా, శుక్రవారం నాటి ప్లీనరీ వేదికపై హరీశ్ కనిపించక పోవడం స్టేడియంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్లీనరీ ఆరంభంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత అమరవీరులకు నివాళి అర్పించిన సమయంలోనూ ఆయన వేదికపై కనిపించక పోవడంతో అసలు ప్లీనరీకి హాజరయ్యారా..? లేదా అంటూ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. హరీశ్ ఏడీ..? ఎక్కడా అంటూ మీడియా ప్రతినిధులూ ఒకరినొకరు వాకబు చేసుకున్నారు. చివరకు ఆయన వేదికపైనే, వెనుక వరుసలో ఉన్నారన్న సమాచారం అందడంతో, ముందు వరుసలో ఉండాల్సిన ఆయన వెనుకకు ఎందుకు వెళ్లారన్న చర్చా జరిగింది. ఆలస్యంగా వేదికపైకి.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, మహేందర్‌రెడ్డిలతో కలసి మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునే ముందే తుమ్మల, మహేందర్‌రెడ్డి వచ్చారు. అయితే సీఎం వెంట కూడా హరీశ్‌రావు కనిపించకపోవడం ప్రాంగణంలో గుసగుసలకు దారితీసింది. అయితే ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోగానే ఆయన, ప్రతినిధులను కలిసేందుకు ఆయా బ్లాకుల వద్దకు వెళ్లినట్లు కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తలను కలుస్తూ తిరిగిన ఆయన ఆలస్యంగానే వేదిక మీదకు వచ్చారు. అయితే, వెనుక వరుసకే పరిమితం కావడం.. టీవీ లైవ్లలోనూ ఆయన ఎవరికీ కనిపించకపోవడంతో, అసలు హాజరు కాలేదేమోనన్న ప్రచారం జరిగింది. హరీశ్‌కు మద్దతుగా ప్రతినిధుల కేకలు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ అంశాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు హరీశ్‌రావు మైక్ ముందుకు రాగానే, ప్రతినిధుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సుమారు మూడు.. నాలుగు నిమిషాల సేపు కేకలతో ఉత్సాహం ప్రకటించారు. హరీశ్ ప్రసంగం మొదలు పెట్టినా, కేకలు ఆపలేదు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మధ్యలో నినాదం చేసి హరీశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కార్యకర్తల నుంచి కేకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో సభా వేదికపై ఉన్న నేతలంతా కార్యకర్తల వైపు, హరీశ్ వైపు చూస్తూ ఉండిపోయారు. ఏం .. జరిగింది?: టీఆర్ఎస్ ప్లీనరీ తేదీ ఖరారు అయ్యాక, వేసిన ఏడు కమిటీల్లోనూ హరీశ్‌కు స్థానం లేనప్పటి నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో కొంత అంతరం ఏర్పడిందని, ఇద్దరి మధ్యా పొసగడం లేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఒక విధంగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే బలమైన అభిప్రాయం కూడా ఉంది. ప్లీనరీ బాధ్యతల నుంచి హరీశ్‌రావును అందుకే దూరం పెట్టారని కొందరు పేర్కొనగా, మిషన్ కాకతీయ పనుల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నందునే ప్లీనరీ బాధ్యతలు ఇవ్వలేదని పార్టీలోని మరి కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొద్ది రోజులుగా హరీశ్‌రావు కొంత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో ఈ రకంగా ఆయన తన అంసతృప్తిని వ్యక్తం చే సి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎనిమిదోసారి ఏకగ్రీవం
టీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ పార్టీ నేతల అభినందనల జల్లు.. కార్యకర్తల సంబరాలు హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖరరావు ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారమిక్కడ ప్లీనరీ వేదికపై అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ‘మన కల నిజమైంది. తెలంగాణ తల్లిని బంధ విముక్తిని చేసేందుకు 2001లో కేసీఆర్‌ను అధ్యక్షునిగా చేసిన రోజే మన పంట పండింది. 14 ఏళ్లుగా ఎన్నో కష్టాలు.. ఇబ్బందులను ఎదురొడ్డి కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకున్నాం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చరిత్ర. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీకి ఎన్నికలు నిర్వహించాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ మెంబర్ల నుంచి అయిదు సెట్ల నామినేషన్లు వచ్చాయి. వీటన్నింటా కేసీఆర్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అందుకే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నా’ అని చెప్పారు. వెంటనే వేదికపై ఉన్న మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరూ కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. వేదికపై పూలవర్షం కురిపించారు. ఎల్బీ స్టేడియం వెలుపలా కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. డప్పు మోగించిన కేసీఆర్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 12 గంటలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లీనరీ ప్రారంభ సూచికగా కేసీఆర్ డప్పు మోగించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ప్లీనరీకి తరలి వచ్చాయి. పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు తొలి పలుకులు వినిపించారు. పునర్నిర్మాణ యజ్ఞం: పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజలు, ప్రభుత్వానికి మధ్య పార్టీ కార్యకర్తలు వారధిగా పని చేయాలని పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ‘టీఆర్ఎస్ కార్యకర్తలంటే తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచిన స్వయం సేవకులు. తెలంగాణ సమాజమంతా టీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తోంది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇది పవిత్ర యజ్ఞం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు చవిచూసిన కార్యకర్తలు పునర్నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారుడే పాలకుడైన సందర్భం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేపిందన్నారు. కేసీఆరే అసలైన లీడర్: ఎంపీ కేశవరావు గత పది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రగతి దేశంలో ఎక్కడా జరగలేదని పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు అన్నారు. ‘తెలంగాణ వచ్చింది.. నా జీవితం ధన్యమైంది. నేను పాటలు రాసుకుంటూ ఉండొచ్చు. ఇంతకంటే పరిపూర్ణత ఏముంది.. అని ఇటీవల కళాకారుల సదస్సులో సీఎం కేసీఆర్ అన్నట్లు టీవీలో చూశాను. తెలంగాణ సాధించిన తర్వాత పీడిత సమాజానికి విముక్తి కల్పించాలనేదే ఆయన తపన. రాష్ట్రం వచ్చేది నిజమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలా..? అని నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ ఒకసారి అడిగారు. మీరే కావాలని నేను చెప్పాను. ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. ఆ విషయంలో ఆయన ఓడిపోయారు గానీ.. తెలంగాణ గెలిచింది. తెలంగాణకు కావాల్సిన నాయకత్వం దొరికింది’ అని కేకే అన్నారు.