ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా.. 

Harish Rao Inspects New Collectorate At Siddipet - Sakshi

2,000 మందికి ఆహార నాణ్యతపై శిక్షణ

అందులో 800 మందికి శిక్షణ పూర్తి

దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా కార్యక్రమం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట జోన్‌: ‘స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా మరో ముందడుగుకు ఇదొక ప్రయత్నం. ప్రజలకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించి ఆరోగ్య సిద్దిపేటగా మార్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి సిద్దిపేటలో రెండు వేల మందికి ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ద్వారా శిక్షణ ఇచ్చి కొత్త ఒరవడితో చరిత్ర సృష్టిద్దాం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్‌లో తినుబండారాల విక్రయాలు, ఆహార నాణ్యతపై పాటించాల్సిన నిబంధనలపై శిక్షణ పూర్తి చేసుకున్న 800 మందికి సామగ్రి, పరికరాలను ఉచితంగా అందజేశారు. మిగతా 1,200 మందికి కూడా శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టిద్దామన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే క్రమంలో దశలవారీగా ప్రగతిని సాధించామన్నారు. దీంతోనే సిద్దిపేటకు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పరిశుభ్రమైన వాతావరణంలో రుచిని, శుచిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఆహార నాణ్యతలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. దేశంలోనే తొలి సారిగా ఒక పట్టణంలో వందశాతం ఆహార విక్రయ యాజమానులకు, కార్మికులకు శుచి, శుభ్రతలపై శిక్షణ ఇచ్చి సిద్దిపేట పట్టణం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు.

జనవరి 15 నుంచి మార్చి 15 వరకు మున్సిపల్‌ అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట వాలంటీర్లు తినుబండారాల విక్రయశాలలను, హోటళ్లను సందర్శించి పనితీరును పరిశీలిస్తారని తెలిపారు. 20 సూత్రాలలో కనీసం 17 సూత్రాలను అమలు చేసే వారికి గ్రీన్‌కలర్‌ చిహ్నంతో కూడిన ఓ కార్డును పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ పొందిన వారికి డ్రెస్‌కోడ్, ఇతర పరికరాలను, శిక్షణ ధ్రువీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఎన్జీవో భవన్‌ నుంచి పట్టణంలో యూనిఫాం ధరించిన ఆహార విక్రయశాలల ప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావు చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు.

కాగా కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దీన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో నిర్మాణ పనులను హరీశ్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top