‘గల్ఫ్’ గోస పట్టించుకోరా? | gulf victims seeks aid from government | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్’ గోస పట్టించుకోరా?

Jul 28 2014 2:56 PM | Updated on Aug 21 2018 3:10 PM

‘గల్ఫ్’ గోస పట్టించుకోరా? - Sakshi

‘గల్ఫ్’ గోస పట్టించుకోరా?

పొట్ట చేతపట్టుకొని ఏడారి దేశాలకు వెళ్లిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

రాయికల్: పొట్ట చేతపట్టుకొని ఏడారి దేశాలకు వెళ్లిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వారి సమస్యలను వినేందుకు కనీసం ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ నాయకులు పలు సందర్భాల్లో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని, కేరళ తరహాలో పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తామని హామీలిచ్చారు.

ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ప్రత్యేక మంత్రిత్వ శాఖ గానీ, ప్రత్యేక వ్యవస్థ గానీ రూపుదాల్చలేదు.  త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గల్ఫ్ బాధితులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి సుమారు పదిహేను లక్షల మంది కార్మికులు ఉపాధికోసం గల్ఫ్‌బాట పట్టారు. ఏజెంట్లు, దళారుల మాయమాటలు నమ్మి, తీరా ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత పరిస్థితి తారుమారు అవుతోంది. ఏజెంట్లు చెప్పిన పని లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు తక్కువ జీతాలకు ఏ పని దొరికినా కాదనకుండా చేయాల్సి వస్తోంది.

ఏజెంట్ల మోసం నకిలీ వీసాలు, సందర్శక వీసాలపై వెళ్లిన పలువురు అక్కడి పోలీసులకు చిక్కి జైలుపాలవుతున్నారు. అనార్యోగం కారణాలు, ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల శవాలు స్వస్థలాలకు రావడానికి నెలలు పడుతోంది. వివిధ కారణాలతో తిరిగివచ్చిన కార్మికులు ఇక్కడ సరైన ఉపాధి లేక సతమతమవుతున్నారు. మరికొంతమంది చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలెన్నో. ఇవ్వన్నీ ఒక ఎత్తయితే,  గతేడాది దుబాయ్, సౌదీఅరేబియా దేశాలు ఆంక్షలు విధించినప్పుడు స్వదేశం తిరిగి వచ్చేందుకు వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

స్వదేశం రాలేక ఆంక్షల గడువు ముగిసిన తర్వాత కూడా దొంగచాటుగా పనిచేసుకుంటున్న వందలాది మంది జైళ్లపాలయ్యారు. ఇటీవల ఇరాక్‌లో అంతర్యుద్ధం నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు ఆయా కంపెనీల శిబిరాల్లో తలదాచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చినప్పటికీ ఇంకా వేలాది మంది కార్మికులు ప్రాణభయంతో అక్కడే బిక్కుబిక్కుమంటున్నారు.

కేరళలో ఇలా...
వలస కార్మికుల రక్షణ విషయంలో కేరళ రాష్ట్ర పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ పౌరులకు ఏ ఆపద వచ్చినా ఆగమేఘాలపై స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పేర్లు నమోదు చేసుకోవడం మొదలు ఆయా దేశాల్లో పని పద్ధతులు, అక్కడ మెలగాల్సిన తీరుపై ముందుగా కార్మికులకు అవగాహన కల్పిస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవాసాంధ్రుల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ శాఖను నిర్వీర్యం చేయడమే కాకుండా కొంతకాలానికి దానిని ఎత్తివేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలోప్రవాస తెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గల్ఫ్ బాధితులు కోరుతున్నారు. తద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement