
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేయడంతో గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పోదెం వీరయ్య, ఆత్రం సక్కు, జాజుల సురేం దర్ పాల్గొన్నారు. అంతకుముందు గూడూరు పేరు ఖరారులో జాప్యం జరిగింది. గురువారం ఉదయమే ఆయన పేరు ప్రకటిస్తారని అనుకున్నా మధ్యాహ్నం వరకు ఢిల్లీ నుంచి సమాచారం రాలేదు. చివరకు ఒంటి గంట ప్రాంతంలో అధికారిక సమాచారం రావడంతో 1:30కి గూడూరు అసెంబ్లీకి చేరుకున్నారు. 2:55కి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం ఏడు నామినేషన్లు...
టీఆర్‌ఎస్ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాశ్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా అలీ హసన్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా గురువారం గూడూరుతోపాటు జాజుల భాస్కర్ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది.
నేడు స్క్రూటినీ...
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఆమోదించనున్నారు. ఈ నెల 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉం డటంతో ఆలోగా ఎవరూ నామినేషన్లు ఉపసంహరించకపోతే 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌం టింగ్ కూడా ఉంటుంది. కాగా, తనపై నమ్మకం ఉం చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి గూడూరు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వం ఖరారులో సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి విక్రమార్క, కుంతియా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.