గ్లామర్‌ గ్రూమింగ్‌

Grooming Classes For Fashion And Beauty Contests - Sakshi

అందాల పోటీలకు రెడీ..అంత ఈజీ కాదు

ప్రత్యేక శిక్షణ.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం  

బ్యూటీ కాంటెస్ట్‌ల కోసం నగరంలో గ్రూమింగ్‌ తరగతులు

తెల్లవారుజామునే నిద్రలేవడం, నచ్చిన వ్యాయామం చేయడం, నిర్ణీత వేళల్లో ఆహార విహారాలు, చక్కని మర్యాద పూర్వకమైన మాట తీరు...ఇవన్నీ చేసే యువతీ యువకులు అరుదే. అయితే అందాల పోటీల్లో పాల్గొనే యువతకు ఇవన్నీ తప్పక ఉండి తీరాల్సిన లక్షణాలు. ప్రస్తుతం నగరం వేదికగా బ్యూటీ కాంటెస్ట్‌ల కోసం పలు సంస్థలు నిర్వహిస్తున్న గ్రూమింగ్‌ తరగతులు యువతను పలు అంశాలలో తీర్చిదిద్దుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.. 

సాక్షి, సిటీబ్యూరో: అందాల ప్రపంచంలో రాణించడం అంత వీజీ కాదు. ముఖ్యంగా మోడలింగ్‌లో సక్సెస్‌ కావాలంటే కేవలం రూపు రేఖలు బాగున్నంత మాత్రాన, లుక్‌ క్లిక్‌ అయినంత మాత్రాన సరిపోదు. నడక దగ్గర్నుంచి నడవడిక దాకా అన్నీ తీర్చిదిద్దినట్టు ఉండాలి. నవ్వినా, నవ్వించినా మన ప్రవర్తన పండాలి. అన్నీ ఉంటేనే పోటీలో నిలుస్తారు. అందులోనూ కొందరే గెలుస్తారు. గెలవకపోయినా విజేతలే. ఎందుకంటే పోటీ సందర్భంగా నిపుణులు నేర్పిన పాఠాలు యువతీ యువకుల భావి జీవితాన్ని మేలు మలుపు తిప్పుతాయంటున్నారు నిపుణులు.

ఉదయించే ఆరోగ్యం...
బ్యూటీ/మోడలింగ్‌ కాంటెస్ట్‌లలో పోటీదారులకు అందించే శిక్షణ నిజంగానే యూత్‌ మోడల్స్‌గా వారిని మార్చుతుంది అంటారు గ్లామర్‌ రంగ నిపుణులు. కనీసం వారం రోజుల నుంచి ఆయా పోటీల నిర్వహణ తీరును బట్టి ఈ గ్రూమింగ్‌ తరగతులు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉదయాన్నే 5 గంటలకే పోటీదారులు నిద్ర నుంచి మేల్కోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి దాదాపు 2 గంటల సమయం స్ట్రెచ్చింగ్, వర్కవుట్, యోగా వంటి వాటికి కేటాయిస్తారు. ఖచ్చితంగా ఉదయం 8 గంటలకు  బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తవుతుంది.  

పిక్చర్‌ పర్ఫెక్ట్‌...
సాధారణంగా ఉదయం వేళలో..అది కూడా తగిన శారీరక శ్రమ చేసి, ఫ్రెష్‌ అయిన తర్వాత ఒక విధమైన తాజాదనం ఉట్టిపడుతుంది. ఆ ఫ్రెష్‌లుక్‌ని సరిగ్గా పట్టుకోవడానికి బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం ప్రతి రోజూ కనీసం గంట నుంచి 2 గంటల పాటు ఫొటో షూట్‌ నిర్వహిస్తారు. ఫైనలిస్ట్‌లుగా ఎంపికైన ప్రతి ఒక్కరికీ కొన్ని వందల సంఖ్యలో ఫొటోలు తీస్తారు. తద్వారా తాము ఏ సందర్భంలో, ఎలా ఉంటామో అలాగే తమ రూపురేఖల్లోని బలం/బలహీనతలు ఏమిటి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. తద్వారా వాటిని సవరించుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. 

వాక్‌.. ఓకే
నీకు నడవడం రాదు అని ఎవరైనా అంటే ఆశ్చర్యపోతాం. మన దృష్టిలో ఏ అవయవలోపం లేకుండా నడవగలుగుతున్న ప్రతి ఒక్కరికీ నడవడం వచ్చినట్టే. అయితే చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకోవడంలో నడక కూడా చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుందనేది చాలా మందికి తెలీదు. అందుకే ఎలా పడితే అలా చేతులు విసురుతూనో, భుజాలు వేలాడేసుకునో, అతిగా ముందుకో, వెనక్కో వంగిపోతూనో నడుస్తూ కూడా బాగానే నడుస్తున్నాం అనుకుంటారు. విభిన్న రకాల ఉత్పత్తులను విభిన్న రకాలుగా ప్రమోట్‌ చేసే పనిలో రకరకాల వాక్స్‌ అవసరం. అందుకే ఈ మోడల్స్‌ గ్రూమింగ్‌లో భాగంగా ఆకట్టుకునేలా నడిచే శైలులను ప్రత్యేకంగా నేర్పిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా దీనికి కేటాయిస్తారు. ఈ నడక మెరుగుపరచుకోవడం అనేది యువత భావి కెరీర్‌కు చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే కార్పొరేట్‌ ఉద్యోగాల్లో నడక తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తారనేది తెలిసిందే.  

టాలెంట్‌ రౌండ్‌ ప్రాక్టీస్‌...
ప్రతి ఒక్కరిలో తమకు తెలిసినవి తెలియనివి కూడా ఎన్నో టాలెంట్స్‌ ఉంటాయి. ఇలాంటివన్నీ బయటకు వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ఆటలు, పాటలు, నృత్యాలు, క్విజ్‌లు...వంటివెన్నో ఉంటాయి. వీటి ద్వారా తమలోని ప్రతిభా సామరŠాధ్యలను సాన బెట్టుకోవడానికి వీలు చిక్కుతుంది. అంతేకాదు తమకే తెలియని ఎన్నో టాలెంట్స్‌ను పసిగట్టడానికి కూడా. ఇవి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని ఈ తరహా గ్రూమింగ్‌ తరగతుల్లో పాల్గొన్న నగర యువతి షీలా చెప్పారు. వీటితో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం కొంత సమయం కేటాయిస్తారు. తద్వారా ఇతరులతో సంభాషించే తీరు తెన్నులను మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుంది.  

నడక నుంచి నడత వరకు..
నడక నుంచి నడత దాకా అన్నీ తీర్చిదిద్దడమే మోడలింగ్‌ పోటీలకు సంబంధించిన గ్రూమింగ్‌ తరగతుల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం యువతలో ఉన్న పలు రకాల బలహీనతలు, లోపాలను చాలా వరకూ ఇవి సవరిస్తాయి. ఇక్కడ శిక్షణ ద్వారా పొందిన అనుభవ సారం భవిష్యత్తులో ఏ రకమైన కెరీర్‌ను ఎంచుకున్నా యువతీ యవకులకు అద్భుతంగా ఉపకరిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందుకే ఈ తరహా పోటీల్లో విజేతలు మాత్రమే  కాదు ఫైనలిస్ట్‌ స్థాయి వరకూ వచ్చిన ప్రతి ఒక్కరూ లాభపడినట్టే అని చెప్పాలి.  – జాన్‌పాల్, గ్రూమింగ్‌తరగతుల నిర్వాహకులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top