
డిసెంబర్‌లో పోరు!
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలను డిసెంబర్ 15లోపు నిర్వహించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలను డిసెంబర్ 15లోపు నిర్వహించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. ఇదే షెడ్యూల్‌లో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కీలక నగరంగా వరంగల్ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌కు ఇటీవలే గ్రేటర్ హోదా కల్పించింది. గ్రేటర్ వరంగల్‌గా మారిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్.. ఇలా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితం ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు కీలకం కానుంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి లక్ష్యంగా.. అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
రాజకీయ పార్టీల్లో కదలిక
వరంగల్ నగరపాలక సంస్థగా ఉన్నప్పుడు చివరిసారిగా 2005 సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. అదే నెల 27న ఫలితాలు వచ్చాయి. పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 2010 సెప్టెంబరులో పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో 53 డివిజన్‌లు ఉండేవి. వరంగల్ నగరపాలక సంస్థలో నగర శివారులోని 42 గ్రామాలు విలీనమయ్యాయి.
2011 జనాభా గణాంకాల ఆధారంగా 58 డివిజన్‌లు అయ్యాయి. డివిజన్‌ల పునర్విభజన పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ఆమోదం రావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డివిజన్‌లలో మార్పులు లేకుండానే ఆమోదం వచ్చే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల తర్వాత వెంటనే వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు భావించాయి.
పెరిగిన, మారిన డివిజన్‌లకు అనుగుణంగా రాజకీయ పార్టీల నాయకులు కార్యకలాపాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌తోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో రెండు మూడు నెలలుగా స్తబ్ధుగా ఉంటున్నారు. హైదరాబాద్ ఎన్నికలపై హైకోర్టు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే ఉండింది. హైకోర్టు తాజా తీర్పుతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది.
గతేడాది జరిగిన పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోనే వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ పదవి రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికీ రిజర్వు అయ్యింది. కీలకమైన మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రావడంతో రాజకీయ పార్టీల్లోనూ అంతర్గత పోటీ అధికంగా ఉండనుంది.
గ్రేటర్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. టీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెలిస్తే మేయర్ ఎవరేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకే ఉండనుంది. టీఆర్‌ఎస్‌లో గ్రేటర్ వరంగల్ పార్టీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ పేరు మేయర్ పదవికి వినిపిస్తోంది. వరంగల్ పశ్చిమకు చెందిన కోరబోయిన సాంబయ్య కూడా మేయర్ పదవికి రేసులో ఉండే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలంతో ఎక్కువ కార్పొరేటర్లను గెలుచుకుని మేయర్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వ్యూహా లు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మేయర్ పదవికి రేసులో ఉండనున్నారు. రాజేందర్‌రెడ్డికి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో మేయర్ విషయంలో నాయినికి పార్టీలో పోటీ ఉండకపోవచ్చు.
గతంలో వరంగల్ మేయర్ పదవిని నిర్వహించిన పార్టీగా బీజేపీ ఎన్నికల్లో గట్టిగా పోరాడే పరిస్థితి ఉంది. టీడీపీ పొత్తుతో బరిలోకి దిగితే బలం చూపవచ్చని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీకి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.