మిల్లర్ల దోపిడీ అ‘ధనం’ 

Grain Merchants Fraud In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కొనుగోలు కేంద్రంలో తీస్తున్న తరుగు కాకుండా, అదనంగా రైస్‌మిల్లర్ల దోపిడీతో రైతులు లబోదిబోమంటున్నారు. తరుగు ఇవ్వని పక్షంలో ధాన్యం దించుకోబోమని మిల్లర్లు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. ముందే అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో తమ ధాన్యాన్ని విక్రయించుకుంటే చేతికందిన కష్టం వర్షానికి తడిసిపోకుండా ఉంటుందనే ఆత్రుతతో రైతులున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మిల్లరు దోపిడీకి తెరలేపారు. కొనుగోలు కేంద్రంలో తీస్తున్న తరుగు కాకుండా, అదనంగా మరో రెండు కిలోలు ఇస్తేనే ఆ లారీలో వడ్లను దిగుమతి చేసుకుంటామని, లేని పక్షంలో ధాన్యాన్ని తీసుకెళ్లాలని సదరు రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పైన పేర్కొన్న ఉదాహరణేæ ఇందుకు నిదర్శనం. నిత్యం వందలాది మంది 
రైతుల కష్టాన్ని అప్పనంగా కాజేస్తున్నారు.

అధికారులకు రైతుల ఫోన్లు.. 
ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు రైస్‌మిల్లులో రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే కడుపు మండిన రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి తమ బాధను చెప్పుకుంటున్నారు. కడ్తా ఇవ్వకపోతే ధాన్యం తిరిగి తీసుకెళ్లమంటున్నారని, ఏమి చేయాలో తెలియడం లేదని రైతులు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. దీంతో మొక్కుబడిగా స్పందిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని మిల్లులకు పంపుతున్నారు. ఈ సిబ్బంది నాణ్యత పరిశీలన పేరుతో మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వంత పాడుతున్నారు. దీంతో రైతులు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత కోత విధిస్తే అంత ఒప్పుకుని మిన్నకుండి పోతున్నారు.
 
కడ్తా ఇవ్వకపోతే నాణ్యత తిరకాసు..
కడ్తా ఇస్తేనే ధాన్యం తీసుకుంటామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. రైతు ఒప్పుకోని పక్షంలో ధాన్యంలో తాలు గింజలున్నాయని, తేమ శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ వేధిస్తున్నారు. ఎవరైనా రైతులు ధైర్యం చేసి అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారం రోజులైనా వారి ధాన్యం కాంటా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే.. 
కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని అధికారులు ఎప్పటి మాటే చెప్పుకొస్తున్నారు. ఎవరైనా రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు రైస్‌మిల్లును బ్లాక్‌ లిస్టులో పెడతామని చెబుతున్నారు. కానీ నిత్యం అక్రమాల దందా కొనసాగుతున్నప్పటికీ.. గత ఐదేళ్లలో ఏ ఒక్క మిల్లును కూడా బ్లాక్‌ లిస్టులో పెట్టిన దాఖలాలు లేవు. వారిపై కనీస చర్యలు తీసుకున్న ఘటనలు కూడా లేవు.

కోత విధించే మిల్లులపై చర్యలు
రైస్‌మిల్లులో కోత విధించడం నిబంధనలకు విరుద్ధం. ఎవరైనా నాణ్యత లేదని ధాన్యం దించుకోని పక్షంలో రైతులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. అధికారులను సంబంధిత రైస్‌మిల్లుకు పంపి ధాన్యం నాణ్యత పరిశీలిస్తాం. అక్కడ నాణ్యత బాగుందని తేలితే సంబంధిత రైస్‌మిల్లుపై చర్యలు తీసుకుంటాము.    –వెంకటేశ్వర్లు, జాయింట్‌ కలెక్టర్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు నల్లమాటి నరేష్, బోధన్‌ మండలం శ్రీనివాస్‌క్యాంపు. తనభూమి, కౌలు భూమి కలిపి 16 ఎకరాలు వరి సాగు చేస్తే సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. దీన్ని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే కాంటా వేసేటప్పుడు రెండు కిలోలు కోత విధించారు. తర్వాత ధాన్యాన్ని రైస్‌మిల్లుకు తరలించాక అక్కడ మరో రెండు నుంచి మూడు కిలోలు తగ్గిస్తామని చెబుతున్నారని నరేష్‌ వాపోతున్నారు. ఇలా క్వింటాలుకు నాలుగు కిలోలంటే 150 క్వింటాళ్లకు ఆరు క్వింటాళ్ల ధాన్యం అక్రమార్కుల పరం అవుతోంది. ఇలా తరుగు పేరుతో నష్ట పోతున్న ఆరు క్వింటాళ్ల ధాన్యం విలువ సుమారు రూ.10,600.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top