‘అందరికీ నమస్కారం..మాకూ చాల సంతోషం’

Governor Tamilisai Soundararajan Peddapalli Visit Highlights - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పెద్దపల్లి జిల్లా పర్యటన బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి గవర్నర్‌ మురిసిపోయారు. బట్టసంచుల తయారీ కేంద్రం, నాప్కిన్స్‌ సెంటర్‌ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. కాసులపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న పంచాసూత్రాల కార్యక్రమం, స్వచ్ఛ వాతావరణం, కిచెన్‌గార్డెన్‌లను చూసి ప్రశంసించారు. నందిమేడారం పంప్‌హస్‌ను చూసి మెచ్చుకున్నారు. ఈసందర్భంగా జిల్లా పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్టీపీసీ రామగుండంలో గవర్నర్‌ పర్యటన హైలెట్స్‌..
► జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లో బుధవారం ఉదయం ప్రారంభమైన గవర్నర్‌ పర్యటన హైలెట్స్‌ ఇలా ఉన్నాయి..
►  9:20 గంటలకు జ్యోతిభవనల్‌లో పోలీసుల గౌరవవందనం స్వీకరణ.
►  9:24 గంటలకు కాన్వాయ్‌తో స్పందన క్లబ్‌కు చేరుకున్నారు.
​​​​​​​► 9:26 గంటలకు గవర్నర్‌ను స్టేజీపైకి ఆహ్వానించారు.
​​​​​​​► 9:29 గంటలకు వందేమాతరం గీతాలాపన.
​​​​​​​► 9:31 గంటలకు గవర్నర్‌కు పూల మొక్కను అందజేశారు.
​​​​​​​► 9:32 గంటలకు పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీదేవసేన కార్యక్రమాలను ప్రారంభించారు.
​​​​​​​►  9:33 గంటలకు శిక్షకుడు డాక్టర్‌ శివ, బాలికల కళరిపయట్టు ప్రదర్శన
​​​​​​​►  9:52 గంటలకు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం
​​​​​​​► 9:58 గంటలకు గవర్నర్‌ తమిళసై ప్రసగం ముగింపు
​​​​​​​►  9:59 గంటలకు కళరిపయట్టు శిక్షకుడు డాక్టర్‌ శివకు శాలువా కప్పి అభినందించిన గవర్నర్‌ తమిళసై
​​​​​​​► 10:00 గంటలకు విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ
​​​​​​​►  10:02 గంటలకు గవర్నర్‌ తమిళసైకి డిక్షనరీ అందించిన పెద్దపల్లి డీఈవో బి.జగన్మోహన్‌రెడ్డి
​​​​​​​►  10:03 గంటలకు కళరిపయట్టు ప్రదర్శించిన బాలికలతో గవర్నర్‌ తమిళసై, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్‌ శ్రీదేవసేనలు గ్రూపు ఫొటో దిగారు.
​​​​​​​► 10:05 గంటలకు ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్‌లో పర్యటన ముగించుకుని బసంత్‌నగర్‌కు బయలుదేరిన గవర్నర్‌ తమిళసై.

బట్టసంచుల తయారీ కేంద్రం సందర్శన
గోదావరిఖని(రామగుండం): బసంత్‌నగర్‌ సమీపంలోని ధర్మారం క్రాస్‌ రోడ్డు వద్ద గల నాన్‌ ఒవెన్‌ క్యారీ బ్యాగుల(బట్ట సంచులు) తయారీ కేంద్రాన్ని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ సందర్శించారు. గవర్నర్‌ దంపతులకు నిర్వాహక మహిళలు వేదపడింతుల మంత్రోచ్ఛారణాల మధ్య మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా  కేంద్రంలో తయారమవుతున్న బ్యాగులు, వాటి సైజులు, ఇతర అంశాల గూర్చి గవర్నర్‌ తెలుసుకున్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేన  స్థానిక తయారీ విధానం, సంచుల నాణ్యత గురంచి స్వయంగా వివరించారు. అనంతరం గవర్నర్‌ కేంద్రం నిర్వాహక మహిళలతో మాట్లాడారు.అంతకుముందు ప్రముఖ పర్యాటక క్షేత్రమైన బుగ్గ రహదారికి సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఎంపీపీ అనసూర్య, జెడ్పీటీసీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల గౌరవవందనం
జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని జ్యోతిభవన్‌లో బుధవారం గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం కళరిపయట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతిపత్రాలు 
అంద జేశారు. 

వావ్‌.. గ్రేట్‌..
పెద్దపల్లిరూరల్‌: ‘అందరికీ నమస్కారం..మాకూ చాల సంతోషం’..అంటూ తెలుగులో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై మాట్లాడడంతో సభికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.   పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో గవర్నర్‌ మాట్లాడుతూ.. కాసులపల్లిలో డ్రైనేజీలను పూడ్చి మురుగునీరు నిల్వ లేకుండా చేసేందుకు సమష్టిగా భాగస్వాములై దోమరహిత గ్రామంగా దేశానికే ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇంటింటికీ పండ్లు, కూరగాయల మొక్కలను అందించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని అభినందించారు. పంచసూత్రాలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలందరిలో అవగాహనను పెంచి స్వచ్ఛతలో సంపూర్ణ ఫలితాలు సాధించడంలో సఫలమయ్యారని గ్రామ సర్పంచ్‌ దాసరి పద్మను ప్రశంసించారు.  గ్రామంలోని కూర సరిత–మల్లారెడ్డి ఇంటి ఆవరణలో పెంచుతున్న కిచెన్‌ గార్డెన్‌ను గవర్నర్‌ పరిశీలించారు. ఇంటి ఆవరణలోని పెరటితోటలో ఉన్న కొత్తివీుర ఆకును చేతితో తెంపి వాసన చూసిన గవర్నర్‌ ఇంటి పంటను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు.

ఉల్లి మడిని చూసి అబ్బో..ఇప్పుడు ఉల్లికి ధర మండిపోతోంది. మీరు పండించి మంచి పనే చేశారు. ఇంటి ఆవరణలో కాసిన అంజీర పండ్లను చూసి రక్తవృద్ధికి, శుద్ధికి తోడ్పడే ఆరోగ్య లక్షణాలున్న పండ్ల చెట్లను పెంచడం అభినందనీయమని సరిత–మల్లారెడ్డి దంపతులను ప్రశంసించారు. అయితే ఈ మొక్కలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సొంత ఖర్చులతోనే అందరికీ పంపిణీ చేశారని ఆ దంపతులు పేర్కొనడంతో ఎమ్మెల్యే గ్రేట్‌ అని అన్నారు. గ్రామంలో అమలవుతున్న పంచసూత్రాల కార్యక్రమంలో భాగంగానే వీటిని పెంచుతున్నారని కలెక్టర్‌ శ్రీదేవసేన గవర్నర్‌కు వివరించారు. ఇంటిలోని తడి, పొడి, ఇనుము, సీసం తదితర వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించే బుట్టలను చూపించి ఈ ఇంటిలో పంచసూత్రాలను పూర్తిగా అమలు చేస్తున్నారని కలెక్టర్‌ చెప్పడంతో ఆ ఇంటికి పంచసూత్రాలు అమలైనట్టు నిర్ధారించే స్టిక్కర్‌ను గవర్నర్‌ స్వయంగా అంటించారు. అంతకముందు గవర్నర్‌కు గామంలో మంగళహారతులతో మహిళలు,  చిందు కళాకారులు, కోలాట మహిళలు, వాయినంతో ఐకేపీ సభ్యులు, ఒగ్గుడోలు, గంగిరెద్దులతో పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఘనంగా  స్వాగతించారు. 

భారీ బందోబస్తు
గవర్నర్‌ పర్యటన భారీ బందోబస్తు నడుమ ముగిసింది. మంగళవారం రాత్రి నుంచి మొదలుకొని గవర్నర్‌ వెళ్లే వరకు పోలీసులు పటిష్ట భద్రత చేపట్టారు. రామగుండం సీపీ వి.సత్యనారాయణ నేతృత్వంలో పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్‌ పర్యవేక్షిస్తూ రోడ్డు మార్గంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్టీపీసీ జ్యోతిభవన్, స్పందన క్లబ్‌ లోపలికి ముఖ్య నాయకులను, మీడియాను తప్ప ఇతరులను అనుమతించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top