ఆన్‌లైన్‌ ఆగమాగం

Government Vocational junior colleges are in Agitation - Sakshi

     సాంకేతిక తప్పులతో తిప్పలు

     ప్రమాదంలో పడిన విద్యార్థుల పరీక్షలు

     వారి ఫీజుల వివరాల్లో గందరగోళం

     పరిష్కరించామంటున్నా తగ్గని పొరపాట్లు 

     గందరగోళంలో ఇంటర్‌ బోర్డు అధికారులు

     ఆందోళనలో కాలేజీల ప్రిన్సిపాళ్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఇలాంటి అనేక సమస్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అన్న తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో యాజమాన్యాలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వొకేషనల్‌ కోర్సులు చదువుతున్న దాదాపు 70 వేల మంది విద్యార్థుల్లో అనేక మంది విద్యార్థుల పరీక్ష ఫీజులు బోర్డుకు చేరకపోవడం, చేరినా తప్పులు దొర్లడంతో యాజమాన్యాలు ఆగమాగం అవుతున్నాయి. ఇక గతంలో పరీక్షలు రాసి ఫెయిల్‌ అయిన దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం తప్పుల తడకగా తయారైంది. దాంతో కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు వరుస తప్పుల కారణంగా బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వొకేషనల్‌ విద్యార్థుల డేటా, ఓల్డ్‌ స్టూడెంట్స్‌ డేటా ఇప్పటివరకు అప్‌డేట్‌ కాలేదని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా వచ్చిన విద్యార్థుల సమాచారంతో రేపు విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్‌ చేసే క్రమంలో అందరికి జనరేట్‌ కాకపోయినా, వాటిల్లో తప్పిదాలు దొర్లినా లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుల సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించినా బోర్డు కార్యదర్శి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోర్డు పరీక్షల నియంత్రణాధికారి చేతులెత్తేసినట్లు సమాచారం. 

ప్రత్యామ్నాయాలు ఉన్నా ససేమిరా.. 
తప్పుల తడకగా వచ్చిన సమాచారంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్‌ కష్టమని, అందులో తప్పులు దొర్లితే బోర్డుకే కాదు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. డేటా సరిగ్గా ఉందా? లేదా? పొరపాట్లు ఉన్నాయా? ఉంటే వాటి సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని పరీక్షల విభాగం ముఖ్య అధికారి మొత్తుకుంటున్నా బోర్డు కార్యదర్శి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బోర్డుకు వచ్చిన విద్యార్థుల ఫీజు చెల్లింపు వివరాలను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లోని వారి లాగిన్‌లో పెట్టి, మార్పులు ఉంటే తిరిగి పంపించమని అడుగుదామంటున్నా ఒప్పుకోవడం లేదని తెలిసింది. లేదా అన్ని కాలేజీలకు తమకు చేరిన డేటాను మెయిల్‌ చేసి, మార్పులు చేసి హార్డ్‌ కాపీలు తీసుకువస్తే బోర్డులో మార్పులు చేద్దామని సూచించినా ఒప్పుకోవడం లేదని సమాచారం. ఆ రెండింటిలో ఏది చేసినా తన వల్లే పొరపాట్లు జరిగాయని ఒçప్పుకున్నట్లు అవుతుందనే ఉద్దేశంతో బోర్డు కార్యదర్శి అందుకు ససేమిరా అంటున్నట్లు కొంతమంది అధికారులు పేర్కొన్నారు. తన హయాంలో ఈ పొరపాట్లు బయటకు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఎలాగూ కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి అధికారుల మార్పు ఉంటుందని, తాను వెళ్లిపోయాక కొత్తగా వచ్చే వారే చూసుకుంటారన్న ఆలోచనతో తప్పుల సవరణకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది.  

ఎందుకీ మొండితనం.. 
సమస్యలు ఉన్నాయని బోర్డు అధికారులకు, బోర్డు కార్యదర్శికి ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను (సీజీజీ) పక్కకు పెట్టి మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఓ ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించడమే గందరగోళానికి కారణమైంది. పైగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, పరిస్థితి గందరగోళంగా మారిందని బోర్డు కార్యదర్శి అశోక్‌కు ఫిర్యాదులు అందినా స్పందించడం లేదని ప్రైవేటు యాజమాన్యాలే కాదు.. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయని తెలిసినా వాటి పరిష్కారానికి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ప్రమాదకర పరిస్థితిని తెస్తున్నారని విమర్శిస్తున్నారు. తప్పులను సవరించకుండా, ఫీజు చెల్లించకుండా విద్యార్థులు నష్టపోయేలా చేసేందుకే కొంతమంది అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రమాదం ఉందని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పేర్కొంటున్నారు.

నల్లగొండ
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో (వొకేషనల్‌) 44 మంది ఫార్మాటెక్‌ విద్యార్థులున్నారు. ఇప్పటివరకు వారి ఫీజు బోర్డుకు చేరలేదు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని ప్రయత్నిస్తున్నా డేటా కనిపించడం లేదు. ప్రతి రోజు బోర్డుకు మెయిల్‌ పంపుతుంటే అప్‌డేట్‌ చేస్తామంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగిసిపోయింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ గందరగోళంలో పడ్డారు. 

దేవరకొండ
దేవరకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో (వొకేషనల్‌) ఆటోమొబైల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ (ఏఈటీ) కోర్సును 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి ఫీజు వాస్తవానికి రూ. 11,490. కానీ వారందరి ఫీజు కింద ఆన్‌లైన్లో చెల్లించినపుడు రూ.7,440 మాత్రమే డిడక్ట్‌ అయి చలానా జనరేట్‌ అయింది. ఇద్దరు ఫిజికల్‌ హ్యాండీక్యాప్డ్‌ వారి ఫీజులూ యాక్సెప్ట్‌ కావడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top