కలెక్టరేట్‌ ఎదుట పంచాయితీ సెక్రటరీల బైఠాయింపు

Government Should Support to Sravanthi Family - Sakshi

మృతదేహంతో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 

రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ 

కలెక్టర్‌ హామీ ఇవ్వాలంటూ బైఠాయింపు 

డీఆర్‌ఓ సర్దిచెప్పినా వెనక్కి తగ్గని పంచాయతీ కార్యదర్శులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రోజూ తమతోపాటు విధుల్లో పాల్గొన్న సహ ఉద్యోగిని అచేతన స్థితిలో పడి ఉండడాన్ని పంచాయతీ కార్యదర్శులు జీర్ణించుకోలేపోయారు. తమ సహ ఉద్యోగిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కదంతొక్కా రు. నాగర్‌కర్నూల్‌కు చెందిన స్రవంతి తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో పని ఒత్తిడి తట్టుకోలేక పురుగు మందుతాగి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా శనివారం సాయంత్రం స్రవంతి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌కు అంబులెన్స్‌లో తీసు కువచ్చారు. అప్పటికే డీపీఓ కార్యాలయం వద్ద వేచి ఉన్న జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్‌ కార్యాలయం నుండి డీపీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీపీఓ సురేష్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, పిల్లల పోషణ ప్రభుత్వమే భరించాలని వినతిలో కోరారు.  

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 
స్రవంతి మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబు లెన్స్, అనాథలుగా మారిన స్రవంతి పిల్లలను కలెక్టరేట్‌ ఎదుట పెట్టి పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీఎన్జీఓ నాయకులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దాదా పు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అయితే కలెక్టర్‌ సీసీ అక్కడికి వచ్చి కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. కలెక్టర్, డీపీఓ స్వయంగా రావాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత డీఆర్‌ఓ మధుసూదన్‌నాయక్‌ అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటా మని, పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివిస్తాని చెప్పినా పంచాయతీ కార్యదర్శులు ఒప్పుకోలేదు. ఎక్స్‌గ్రేషియా విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.  రాత్రి 10.15 గంటల ప్రాంతంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ వచ్చి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే టీఎన్‌జీఓ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

దిక్కులేని వారైన పిల్లలు 
స్రవంతి మృతితో తన ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. స్రవంతి భర్త గత 8 నెలల క్రితమే నాగర్‌కర్నూల్‌ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అనంతరం పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన స్రవంతి పిల్లలు రోహన్‌ (రెండో తరగతి), అనుకృతి (మూడో తరగతి)ని చదివిస్తుంది. ఈ క్రమంలో స్రవంతి మృతిచెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. కలెక్టరేట్‌ ముందు పిల్లలతో ధర్నా చేస్తుండడంతో ఏం జరగుతుందో తెలియని పసిపిల్లల ముఖాలు చూసిన ప్రతిఒక్కరి మనసు కలచివేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top