100% వసూలు కావాల్సిందే.. | Government mandate for Municipalities and Corporations | Sakshi
Sakshi News home page

100% వసూలు కావాల్సిందే..

Mar 2 2020 2:34 AM | Updated on Mar 2 2020 2:34 AM

Government mandate for Municipalities and Corporations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆస్తి పన్నులు, ట్రేడ్‌ లైసెన్సులు, ప్రకటనల పన్ను, షాపుల అద్దెల వసూళ్ల తీరుపై పురపాలక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియబోతుండగా, ఇప్పటివరకు నివాసగృహాల యజమానుల నుంచి కేవలం 62% ఆస్తి పన్నే వసూలు చేశా రని మున్సిపల్‌ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు 30% కూడా జరగలేదని తెలిపింది.

నివాస గృహాల నుంచి రూ.672.30 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.416.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, మరో రూ.255.44 కోట్లు రాబట్టాల్సి ఉందని తెలిపింది. ఎట్టి పరిస్థితిలోనైనా మార్చి 31లోగా 100% ఆస్తి పన్నులు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, ప్రకటనల పన్ను, దుకాణాల అద్దెలను వసూలు చేయాల్సిందేనని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ డి.సత్యనారాయణరెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆస్తి పన్నులు, ఇతర పన్నులు, ఫీజుల వసూళ్ల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని మున్సిపల్‌ కమిషనర్లు అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో కోరారు.  

వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో వారి జాబితా.. 
సకాంలలో ఆస్తి పన్నులు చెల్లించడంలో విఫలమైన వారికి రెడ్‌ నోటీసులు జారీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఒక్కో బిల్‌ కలెక్టర్‌ పరిధిలో టాప్‌ 500 బకాయిదారులను గుర్తించి వారి నుంచి బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించక భారీగా బకాయిపడిన వారిని వ్యక్తిగతంగా సంప్రదించి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తే కొత్త మున్సిపల్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం వారికి లీగల్‌ నోటీసులు పంపాలని తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలను ఎగనామం పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాల యజమానుల జాబితాను మున్సిపాలిటీ వెబ్‌సైట్, కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శనకు ఉంచాలని స్పష్టం చేసింది. 

 జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో వివిధ పన్నుల వసూళ్లు.. (రూ.కోట్లలో)  

వసూళ్ల లక్ష్యాలు..
85 శాతం ఆస్తి పన్నులను బిల్‌ కలెక్టర్లు వసూలు చేయాలని, మిగతా 10% బకాయిలను మేనేజర్లు, మున్సిపల్‌ ఇంజనీర్లు, ప్లానింగ్‌ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టి వసూలు చేయాలని, మిగతా 5%  బకాయిలను మున్సిపల్‌ కమిషనర్‌ వ్యక్తిగత చొరవ చూపి వసూలు చేయాలని పురపాలక శాఖ లక్ష్యాలను నిర్దేశించింది. వసూళ్లపై కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు తమ స్థాయిల్లో రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement