కొత్త బాస్‌

GHMC New Commissiner DS Lokesh Kumar - Sakshi

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేష్‌కుమార్‌

తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసిన దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా  డీఎస్‌ లోకేష్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతంజీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా పూర్తిస్థాయి అదనపుబాధ్యతలు నిర్వర్తిస్తున్నఎం.దానకిశోర్‌ను జలమండలి ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానకిశోర్‌ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న లోకేష్‌కుమార్‌ను బదిలీ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లోకేష్‌కుమార్‌ గతంలో కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌గా, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌మిషన్‌ డైరెక్టర్‌గాపనిచేయడంతోపాటు ఖమ్మం, అనంతపురం జిల్లాలకలెక్టర్‌గా కూడా పనిచేశారు. పనిచేసిన అన్నిచోట్లా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 

బల్దియాలో దానకిశోర్‌ ముద్ర  
జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌గా గత సంవత్సరం ఆగస్ట్‌ 25న బాధ్యతలు చేపట్టిన దానకిశోర్‌ సరిగ్గా సంవత్సరం పూర్తయ్యాక బదిలీ కావడం యాధృచ్ఛికమే అయినా ఏడాది కాలంలో ఆయన చేయగలిగినన్ని పనులు చేయడంతోపాటు  పలు వినూత్న కార్యక్రమాలతోనూ తనదైన ముద్ర వేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కే ఎన్నికల విధులు కూడా ఉండటంతో ఆయన వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభలతో సహ వివిధ ఎన్నికలు రావడంతో  జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ సమాంతరంగా పనులు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఎన్నికల అధికారుల శిక్షణ దాకా ఎన్నో పనులున్నప్పటికీ, నగర ప్రజల సమస్యలకే తొలిప్రాధాన్యతనిచ్చారు. ఇల్లు బాగుండాలంటే ఇల్లాలితోనే సాధ్యమన్నట్లుగా నగర సమస్యల పరిష్కారంలోనూ మహిళలు కీలకపోత్ర పోషించాలని భావించారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ వారి భాగస్వామ్యం పెంచడంతోపాటు వారిద్వారా అందే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం లభించాలని ఆశించారు.  సాధారణంగా అధికారులు తమకంటే ముందున్న అధికారులు ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించడం రివాజు అయినప్పటికీ, దానకిశోర్‌ మాత్రం గత కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే తనదైన శైలిలో మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

నగరంలో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్‌ తదితర సమ్యలకు సంబంధిత విభాగాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని గ్రహించి ఆ దిశగా కృషి చేశారు. స్వచ్ఛ నగరం కోసం గత కమిషనర్లు కూడా  కృషి చేసినప్పటికీ, ‘సాఫ్‌హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’ పేరిట వార్డు స్థాయి వరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టారు. వానొస్తే నగర రోడ్లు చెరువులుగా మారుతున్న దుస్థితిని తప్పించేందుకు క్షేత్రస్థాయిలో ఇంజినీర్లతో  కలిసి పర్యటించి సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ నిర్మాణం ప్రారంభించారు. చెత్త సమస్యల పరిష్కారంలో భాగంగా సాయంత్రం వేళల్లోనూ చెత్త తరలించేందుకు అదనపు వాహనాలను సమకూర్చారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వాహనాలను కేటాయించడంతో పాటు  వీధివ్యాపారులు తప్పనిసరిగా రెండు చెత్తడబ్బాలు ఏర్పాటుచేసుకునేలా చర్యలు చేపట్టారు. పారిశుధ్యకార్మికులందరికీ బీమా సదుపాయం కల్పించారు.  ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ రెగ్యులర్‌ ఉద్యోగులకుహెల్త్‌కార్డుల చొరవ చూపడంతో త్వరలోనే అవి జారీ అయ్యే దశకు వచ్చాయి. ప్రజావాణికి అధికారులు హాజరుకాని పరిస్థితినుంచి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. తాను కూడా హాజరవుతూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. సాయంత్రం వేళల్లోనూ సందర్శకుల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారు వరండాల్లో నిలబడకుండా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, స్వయంగా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చేందుకు ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరించేవారు. ఇటీవలి భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయించగలిగారు.దోమల నివారణకు రికార్డుస్థాయిలో ఇప్పటికే 1100 మెడికల్‌ క్యాంపులు నిర్వహించడంతోపాటు  మరో 600 క్యాంపులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని, నగరంలో చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని దానకిశోర్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top